బంగ్లాదేశ్‌కు అందిస్తున్న ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌలభ్యాన్ని రద్దు చేసిన భారత్ !

Telugu Lo Computer
0


బంగ్లాదేశ్‌కు అందిస్తున్న కీలక ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌలభ్యాన్ని రద్దు చేసినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ సౌలభ్యాన్ని భారత్‌ 2020లో బంగ్లదేశ్‌కు కల్పించింది. దీని ద్వారా బంగ్లాదేశ్ తన ఎగుమతి సరుకులను భారత భూభాగంలోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల ద్వారా భారతీయ ఓడరేవులు, విమానాశ్రయాలకు పంపి, అక్కడ నుండి మూడవ దేశాలకు రవాణా చేసేది. భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చింది. ఈ ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌలభ్యం ద్వారా బంగ్లాదేశ్  తన సరుకులను నేపాల్, భూటాన్ తదితర దేశాలకు సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో రవాణా చేయగలిగింది. భారతదేశం ఈ సౌలభ్యాన్ని రద్దు చేయడానికి వెనుక పలు కారణాలన్నాయి. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సౌలభ్యం కారణంగా భారత విమానాశ్రయాలు, ఓడరేవులలో గణనీయమైన రద్దీ ఏర్పడుతోంది. దీని వల్ల లాజిస్టికల్ ఆలస్యం కావడానికి తోడు, భారతదేశ ఎగుమతులకు అధిక ఖర్చులు అవుతున్నాయి. ఈ రద్దీ భారత ఎగుమతులకు అడ్డంకిగా మారడంతో భారత్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ ఇటీవల చైనాలో పర్యటించి, భారత ఈశాన్య ప్రాంతాన్ని ల్యాండ్‌లాక్డ్ ప్రాంతంగా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో చైనా ఆర్థిక ప్రభావాన్ని విస్తరించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు భారతదేశంలో దౌత్యపరమైన అలజడిని రేపాయి. దీనికి ప్రతిగానే భారత్‌ ఈ సౌలభ్యాన్ని రద్దు చేసిందని అంటున్నారు. భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా దాని రెడీమేడ్ గార్మెంట్ పరిశ్రమ దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపై ఈ సౌలభ్యం దూరం కావడంతో బంగ్లాదేశ్ ఎగుమతిదారులు లాజిస్టికల్ ఆలస్యాలు, అధిక రవాణా ఖర్చులు, అనిశ్చితిని ఎదుర్కోవలసిన పరిస్థితి ఎదురవుతుంది. ఫలితంగా నేపాల్, భూటాన్, మయన్మార్ తదితర దేశాలలో బంగ్లాదేశ్ సాగిస్తున్న వాణిజ్యంపై ప్రభావం పడనుంది. ఇప్పటికే అమెరికా విధించిన అధిక సుంకాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌కు ఇది మరో ఆర్థిక దెబ్బగా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)