పోలీసులకు చెప్తున్నా మీ బట్టలూడదీస్తా : జగన్ వివాదస్పద వ్యాఖ్యలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పాపిరెడ్డిపల్లిలో ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జన్మోహన్ రెడ్డి పరామర్శించారు. పార్టీ తరఫున తామున్నామని, ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు మెప్పుకోసం పోలీసులు పని చేస్తున్నారని తప్పుబట్టారు. “టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబుకు వాచ్ మెన్లుగా పని చేస్తున్న పోలీసులకు చెప్తున్నా మీ బట్టలూడదీస్తా, మీ యూనిఫాం తీస్తా, ఉద్యోగాలు లేకుండా చేస్తా, ఎల్లకాలం చంద్రబాబు పాలనే సాగదు, ప్రతీ పనికీ వడ్డీతో సహా లెక్కేసి దోషులుగా నిలబెడతా” అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో నంది అవార్డు తీసుకోనందుకే, కుల వివక్షపై ప్రశ్నించినందుకే.. పోసానిపై 18 కేసులు పెట్టి నెల రోజులకు పైగా జైల్లో పెట్టారని మండిపడ్డారు. ఆనాడు టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వల్లభనేని వంశీ స్పాట్‌లో లేకున్నా ఆయన్ను దోషిగా చేసి జైల్లో వేశారని అన్నారు. నందిగాం సురేష్‌ను 145 రోజులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని 55 రోజులు జైల్లో ఉంచి కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను టార్గెట్ చేసిందని అన్నారు. రాష్ట్రంలో 57 చోట్ల స్థానికల సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంటే సీఎం చంద్రబాబు రకరకాల సాకులు చెప్పి ఏడుచోట్ల ఎన్నికలు వాయిదా వేయించారని జగన్ ఆరోపించారు. మిగతా వాటిలో ఎలక్షన్ జరిగితే అందులో 39 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుందని చెప్పారు. చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని, పోలీసులను వాచ్‌మెన్ల కంటే హీనంగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఒక్క ఎంపీపీ పదవి పోతే చంద్రబాబుకు ఏం పోతోందని ప్రశ్నించారు. రామగిరి మండలంలో 10 మంది ఎంపీపీలు ఉంటే అందులో 9మంది ఎంపీపీలు వైసీపీ వాళ్లేనని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే, ఆమె కొడుకు పోలీసులను దుర్వినియోగం చేసి వైసీపీ ఎంపీపీలను బెదిరించారని ఆరోపించారు. రామగిరి ఎస్సై సుధాకర్ వైసీపీ నేతల కాన్వాయ్‌లో జొరబడి ఎమ్మెల్యేకు వీడియో కాల్‌ చేసి మాట్లాడించారని చెప్పారు. అదే ఎస్సై వైసీపీ ఎంపీపీలను బలవంతంగా పెనుగొండ తీసుకెళ్లి బైండోవర్ చేశాడని తప్పుబట్టారు. అన్ని తప్పులు చేసిన ఎస్సైపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు జగన్. అటు, టీడీపీ శ్రేణులు వైసీపీ వాళ్లపై దాడులకు తెగబడి లింగమయ్యను బేస్ బాల్ స్టిక్స్, కత్తులు, కర్రలతో దారుణంగా కొట్టి చంపారని వైసీపీ అధినేత మండిపడ్డారు. పోలీసులు తీరు మార్చుకోకపోతే తాను అధికారంలోకి వచ్చాక వాళ్ల యూనిఫాం తీసేయించి, శిక్షిస్తానంటూ వైఎస్ జగన్ హెచ్చరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)