మార్కెట్‌ పతనంలోనూ పెరిగిన వారెన్‌ బఫెట్‌ సంపద

Telugu Lo Computer
0


మెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతీకార సుంకాలు విధిస్తామనే హెచ్చరికలతో, అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌మార్కెట్లు కుదేలయ్యాయి. ఫలితంగా 2025లో ప్రపంచ కుబేరుల సంపద భారీగా హరించుకుపోయింది. ఇంత మార్కెట్‌ పతనంలోనూ అమెరికా దిగ్గజ మదుపరి వారెన్‌ బఫెట్‌ సంపద ఈ ఏడాదిలోనే 12.7 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1.10 లక్షల కోట్లు) మేర పెరగడం విశేషం. బఫెట్‌ దీర్ఘకాల దృక్పథంతో పెట్టుబడులు పెట్టడమే ఇందుకు కారణం. అమెరికా మార్కెట్లలో పరిణామాలను ముందుగానే ఊహించి, అక్కడి దిగ్గజ కంపెనీల్లోని తన వాటాలు విక్రయించి, విలువ పెరుగుతుందని అంచనా వేసిన జపాన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడమే బఫెట్‌ సంస్థ సంపద విలువ పెరగడానికి కారణం. ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ పగ్గాలు చేపట్టాక, అమెరికా స్టాక్‌మార్కెట్లలో కంపెనీల మార్కెట్‌ విలువ దాదాపు 8 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.688 లక్షల కోట్లు) ఆవిరైంది. ఇందులో 5 లక్షల కోట్ల డాలర్లు వివిధ దేశాలపై విధించనున్న సుంకాల ప్రకటన అనంతరం గత గురు - శుక్రవారాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. శుక్రవారం ఒక్కరోజే 329 బి.డాలర్ల సంపద ఆవిరైంది. కొవిడ్‌-19 సంక్షోభం తర్వాత అమెరికా మార్కెట్లకు ఇదే అతిపెద్ద ఒకరోజు నష్టం. ప్రపంచంలోని 500 మంది అగ్రగామి కుబేరుల సంపద విలువ గురువారం ఒక్కరోజే 208 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.17.73 లక్షల కోట్లు) తగ్గింది. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం.. కొవిడ్‌-19 పరిణామాల తర్వాత ఈ స్థాయిలో వీరు సంపద కోల్పోవడం ఇప్పుడే. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎలాన్‌ మస్క్‌ సంపద 130 బి.డాలర్లు తగ్గింది. జెఫ్‌ బెజోస్‌ సంపద 45.2 బి.డాలర్లు తగ్గి 193 బి.డాలర్లకు, జుకర్‌బర్గ్‌ సంపద 28.1 బి.డాలర్లు తగ్గి 179 బి.డాలర్లకు పరిమితమైంది. బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 18.6 బి.డాలర్లు, బిల్‌ గేట్స్‌ 3.38 బి.డాలర్ల సంపద కోల్పోయారు. ఒక పక్క కుబేరులు సంపద కోల్పోతుంటే.. బఫెట్‌ సంస్థ బెర్క్‌షైర్‌ హాత్‌వే మాత్రం ముందుగానే యాపిల్, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాల్లో వాటాలు తగ్గించుకుని, నగదు నిల్వలను పెంచుకుంది. ఈ నిధులను జపాన్‌ సంస్థలు మిత్సుయ్, మిత్సుబిషి, సుమిటోమో, ఇటోచు, మారుబెనిల్లో వాటాలు పెంచుకునేందుకు వెచ్చించింది. ప్రస్తుతం మిత్సుయ్‌లో 9.82%, మిత్సుబిషి (9.67%), సుమిటోమో (9.29%), ఇటోచు (8.53%), మారుబెనీ (9.30%)ల్లో వాటాలు బఫెట్‌కు ఉన్నాయి. ఈ కంపెనీల షేర్లు లాభపడటంతో, బెర్క్‌షైర్‌ మార్కెట్‌ విలువ 1.14 ట్రి.డాలర్లు పెరిగింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)