అమెరికా ప్రభుత్వం రద్దు చేసిన వీసాల్లో 50 శాతం భారతీయ విద్యార్థులవేనని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ అమెరికా దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్‌కు అందిన నివేదికల ప్రకారం ప్రభుత్వం రద్దు చేసిన 327 వీసాల్లో 50 శాతం భారతీయులు ఉన్నారని, అయితే వారి వీసా రద్దుకు సరైన కారణాలు పేర్కొనలేదని జైరాం రమేశ్ పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇటువంటి చర్యల వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. నివేదిక ప్రకారం వీసాలు రద్దు చేసిన విద్యార్థుల్లో 50 శాతం మంది భారత్‌కు చెందినవారు కాగా 14 శాతం మంది చైనీయులు. తర్వాతి స్థానాల్లో దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఉన్నారు. దీనిపై ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ మాట్లాడుతూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది. ఈవిషయంపై భారత విదేశాంగ శాఖ నుంచి ఎటువంటి స్పందన లేదు. చట్టబద్దమైన పత్రాలు లేని విద్యార్థులను దేశం నుంచి బహిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. తాజాగా ట్రంప్ యంత్రాంగం పలు యూనివర్సిటీలలోని విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. విదేశాంగ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విదేశీ విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అకస్మాత్తుగా వీసాలు రద్దు చేయడంతో చదువులు కొనసాగించలేకపోతున్నామని.. తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కాగా నిరసన కార్యక్రమాలలో పాల్గొనని వారి వీసాలు కూడా రద్దయినట్లు కళాశాలలు పేర్కొంటున్నాయి. వీసాల రద్దుకు అధికారులు సరైన కారణాలు కూడా తెలియజేయట్లేదని విద్యార్థులు వాపోయారు.
అమెరికా రద్దు చేసిన వీసాల్లో 50 శాతం భారతీయ విద్యార్థులవే : జైరాం రమేశ్
April 18, 2025
0
Tags