తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై జరిగిన భేటీ ముగిసింది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల డీ లిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ భేటీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హాజరయ్యారు. కర్ణాటక తరపున డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఇతర దక్షిణాది నేతలు హాజరయ్యారు. ఏపీ నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరు కాకపోయినా తన అభిప్రాయాన్ని లేఖ ద్వారా స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయవద్దని, దామాషా ప్రాతిపదికన చేయాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాయడమే కాకుండా ఆ లేఖ సారాంశాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు పంపించారు. డీ లిమిటేషన్‌పై ఇవాళ జరిగిన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ భేటీలో నేతలంతా ఏడు పాయింట్ల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. డీ లిమిటేషన్ ప్రక్రియను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయపార్టీలు, భాగస్వామ్యులతో పూర్తిగా చర్చించిన తరువాతే చేపట్టాలని జేఏసీ స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యం స్వభావాన్ని మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే డీ లిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భాగస్వామ్యులతో చర్చించాలి. జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయడంతో జనాభా తగ్గించుకున్న రాష్ట్రాలను శిక్షించకూడదు. దీనికోసం అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలి. 42,84, 87 రాజ్యాంగ సవరణల ప్రకారం జనాభా నియంత్రణ చర్యల్ని సమర్ధవంతంగా అమలు చేసిన రాష్ట్రాల్ని ప్రోత్సహించే చర్యలు తీసుకోవాలి. జనాభా స్థిరీకరణ లక్ష్యం ఇంకా నెరవేరనందున 1971 జనాభా లెక్కల ఆధారంగా మరో 25 ఏళ్లు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టకూడదు. ఈ అంశాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం డీ లిమిటేషన్ కసరత్తు ప్రారంభించే జాయింట్ యాక్షన్ కమిటీ అందుకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఎంపీల కోర్ కమిటీ పార్లమెంటరీ భేటీలో ప్రధాని మోదీకు ఈ అంశాలతో ప్రాతినిధ్యం సమర్పించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీలు తమ తమ రాష్ట్రాల్లోని శాసనసభల్లో తీర్మానాలు చేసేందుకు ప్రయత్నిస్తాయి.
నో డీలిమిటేషన్ పై ఏడు పాయింట్ల ఏకగ్రీవం తీర్మానం !
March 22, 2025
0
Tags