బహు భాషా విధానంపై నా వైఖరి మారలేదు : ఎక్స్‌ వేదికగా పవన్‌ కల్యాణ్‌

Telugu Lo Computer
0

ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను వ్యతిరేకించడం సరి కాదని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అన్నారు. భారతదేశ జాతీయ, సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో ఈ రెండు అంశాలు దోహదపడవన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. ''నేను ఎప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదు. దానిని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించాను. ఎన్‌ఈపీ-2020 స్వయంగా హిందీని అమలు చేయలేదు. హిందీ భాష అమలు విషయంలో తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఎన్‌ఈపీ-2020 ప్రకారం విద్యార్థులు విదేశీ భాషతో పాటు ఏవైనా రెండు భారతీయ భాషలు (మాతృ భాషతో పాటుగా) నేర్చుకునే వెసులుబాటు ఉంటుంది. హిందీ వద్దనుకుంటే వారి మాతృ భాషతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ... ఇలా ఏదైనా ఇతర భారతీయ భాషను ఎంచుకోవచ్చు. విద్యార్థులకు ఎంపిక చేసుకునే సాధికారత కల్పించడం ద్వారా జాతీయ ఐక్యతను ప్రోత్సహించడం, భారతదేశ గొప్ప భాషా వైవిధ్యాన్ని కాపాడటం కోసం బహుభాషా విధానాన్ని రూపొందించారు. దీన్ని రాజకీయ అజెండా కోసం తప్పుగా అర్థం చేసుకోకూడదు. బహు భాషా విధానంపై పవన్‌ కల్యాణ్‌ తన వైఖరిని మార్చుకున్నారని చెప్పడం పూర్తిగా అవగాహనా రాహిత్యమే అవుతుంది. ప్రతి భారతీయుడికి భాషా స్వేచ్ఛ, విద్యను ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ ఉండాలన్న విషయంలో జనసేన పార్టీ కట్టుబడి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)