బంగ్లాదేశ్‌లో పెల్లుబికిన నిరసనలు ?

Telugu Lo Computer
0


బంగ్లాదేశ్‌లో అత్యాచారానికి గురైన ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మగురా నగరంలోని తన అక్క ఇంటికి వెళ్లినప్పుడు బాలికపై అత్యాచారం జరిగినట్లు బాధితురాలి తల్లి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలిక అక్క భర్త (18 ఏళ్లు)తోొ పాటు ఆయన తల్లిదండ్రులు, సోదరుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలిక చనిపోయినట్లు తెలియడంతో ఆగ్రహానికి గురైన కొందరు అత్యాచార ఘటన జరిగిందని భావిస్తున్న ఇంటిపై గురువారం రాత్రి దాడి చేసి, నిప్పంటించారు. మూడుసార్లు గుండెపోటు రావడంతో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు బాలిక మరణించిందని ప్రభుత్వ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం ప్రకటన విడుదల చేసింది. "వైద్యులు రెండుసార్లు పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చినప్పటికీ, మూడోసారి మాత్రం చికిత్సకు గుండె స్పందించలేదు" అని ప్రకటనలో పేర్కొంది. బాలిక మృతదేహాన్ని ఆర్మీ హెలికాప్టర్‌లో మగురాకు తీసుకొచ్చారు, సాయంత్రం 6:00 గంటలకు హెలికాప్టర్ స్థానిక స్టేడియంలో ల్యాండ్ అయింది. అప్పటికే నిరసనలు తీవ్రమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చాలా కష్టపడ్డారని మగురా సదర్ పోలీస్ స్టేషన్ అధికారి అయూబ్ అలీ చెప్పారని స్థానిక వార్తా సంస్థ ది డైలీ స్టార్ పేర్కొంది. అంత్యక్రియలకు ముందు నిర్వహించిన చివరి ప్రార్థన 'నమాజ్-ఇ-జనాజా' సందర్భంగా మగురా పబ్లిక్ స్క్వేర్ వద్ద వేలాది మంది గుమిగూడారు. అత్యాచార బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మహిళలు, పిల్లల భద్రతకు సంబంధించిన చట్టాల్లో సంస్కరణలు తీసుకురావాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)