యూఏఈలో భారత మహిళకు మరణశిక్ష అమలు !

Telugu Lo Computer
0

యూఏఈలో భారత మహిళ షెహజాది ఖాన్‌కు మరణశిక్ష అమలైంది. తన సంరక్షణలో ఉన్న చిన్నారి మృతి కేసులో హత్య అభియోగాలు నమోదుకావడంతో ఉత్తర ప్రదేశ్‌లోని బాందా జిల్లాకు చెందిన ఆమెకు యూఏఈ ప్రభుత్వం మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. తమ కుమార్తెను రక్షించాలంటూ కుటుంబం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఫిబ్రవరి 15నే ఈ శిక్ష అమలైంది. ఈ విషయాన్ని ఢిల్లీ హైకోర్టుకు విదేశాంగ శాఖ తెలియజేసింది. యూపీలోని బాందా జిల్లా గోయ్రా ముగ్లి గ్రామానికి చెందిన షెహజాది 2020లో కిచెన్‌లో పనిచేస్తుండగా అగ్నిప్రమాదానికి గురైంది. అనంతరం ఆసుపత్రిలో చికిత్సతో కోలుకుంది. 2021లో ఉజైర్‌ అనే వ్యక్తి ఆమెను యూఏఈలోని అబుదాబీకి తీసుకెళతానని, అక్కడ జీవితం బాగుంటుందని ఆశపెట్టాడు. ఆ మాటలు నమ్మి అతడితో వెళ్లింది. ఉజైర్‌ ఆమెను ఆగ్రాలోని తమ బంధువులైన ఫైజ్‌, నాడియా దంపతులకు విక్రయించాడు. వారు ఆమెను అబుదాబీకి తీసుకెళ్లారు. చివరికి ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో న్యాయస్థానం ఆదేశాలతో ఫైజ్‌-నాడియా దంపతులపై మానవ అక్రమ రవాణా కేసు నమోదు చేశారు. మరోవైపు అదే సమయంలో ఫైజ్‌-నాడియా దంపతుల బిడ్డ బాగోగులు షెహజాదినే చూస్తోంది. అనుకోకుండా ఆ బిడ్డ చనిపోవడంతో ఆ దంపతులు ఆమెపై హత్య ఆరోపణలు మోపారు. అక్కడి దర్యాప్తు బృందాలు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చాయి. షెహజాది మాత్రం ఔషధాల విషయంలో ఆ దంపతులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే చిన్నారి ప్రాణాలు పోయినట్లు చెబుతోంది. కానీ, న్యాయస్థానం మాత్రం ఆమెకు మరణశిక్షను విధించింది. ఇక యూపీలోని ఆమె తండ్రి షబ్బీర్‌ ఖాన్‌ తన కుమార్తెను కాపాడాలని ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేశాడు. తాజాగా అక్కడి జైలు అధికారులు షెహజాది చివరి కోరిక ఏమిటని అడగ్గా కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి మాట్లాడతానని అభ్యర్థించింది. దీంతో యూపీలోని ఆమె కుటుంబ సభ్యులతో వారు మాట్లాడించారు. ఈ సందర్భంగా తాను నిర్దోషినని ఆమె కుటుంబం వద్ద కన్నీటి పర్యంతమైంది. తాజాగా ఆమెకు మరణశిక్ష అమలైంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)