తెలంగాణలో గ్రీన్ మర్డర్ జరుగుతోందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ 'ఎక్స్'లో పోస్టు చేశారు. గతంలో భారాస, ఇప్పుడు కాంగ్రెస్ కోతలు మరింత లోతుగా ఉన్నాయన్నారు. కాళేశ్వరం కోసం భారాస 25 లక్షల చెట్లను నరికివేసిందని విమర్శించారు. హరితహారం ముసుగులో కోనోకార్పస్‌ను (పర్యావరణానికి నష్టం కలిగించే మొక్కలు) బహుమతిగా ఇచ్చిందని ఎద్దేవా చేశారు. కంచ గచ్చిబౌలిలో జరిగిన హరిత విధ్వంసంలో కాంగ్రెస్ చేరిందని పేర్కొన్నారు. అదే గొడ్డలి.. కొత్త చేతులని పేర్కొన్నారు. తెలంగాణలో అటవీ నిర్మూలన మాఫియాను ప్రోత్సహిస్తున్నారని సంజయ్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ద్వారా 400 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలనుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని భాజపా కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న భూమిని ఆనుకుని చాలా వృక్షజాతులు, పక్షిజాతులతో సహా నెమళ్లు, వలస పక్షులు, జింకలు, అడవి పందులు, కొండ చిలువలు, నక్షత్ర తాబేళ్లు వంటి వైవిధ్యభరితమైన జీవజాతులు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలో 'కంచ గచ్చిబౌలి' భూముల వేలం రద్దు చేయాలని విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పోస్ట్ పెట్టారు.
తెలంగాణలో గ్రీన్ మర్డర్ జరుగుతోంది : బండి సంజయ్
March 31, 2025
0
Tags