పాస్టర్ ప్రవీణ్ విజయవాడలో నాలుగు గంటల పాటు ఎక్కడున్నారనేదానిపై పోలీసులు టెక్నికల్ గా ఆధారాలు సేకరించారు. మీడియా కథనాల ప్రకారం రాజమండ్రి చేరుకోవడానికి ముందు పాస్టర్ ప్రవీణ్ విజయవాడలో ఆగినట్టు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. అయితే దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవడంతో సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా ప్రవీణ్ ప్రతి కదలికను పోలీసులు గుర్తించారు. దీనికోసం విజయవాడ, రాజమహేంద్రవరం పోలీసులు మొత్తం 300 కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. పాస్టర్ ప్రవీణ్ మార్చి 24వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తన బైక్ పై బయలుదేరారు. అదే రోజు మధ్యాహ్నం రూ.650 పెట్టి కోదాడలో లిక్కర్ బాటిల్ కొన్నాడు. ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చేముందు మద్యం సేవించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కంచికచర్ల-పరిటాల మధ్య బైక్ అదుపుతప్పి పడిపోవడంతో బైక్ హెడ్లైట్ పగిలిపోయింది. దీంతో సేఫ్టీ రాడ్స్ వంగిపోగా ప్రవీణ్ చేతులకు గాయాలయ్యాయి. అక్కడినుంచి గొల్లపూడికి చేరుకున్న తర్వాత బంకు వద్ద పెట్రోలు పోయించుకున్నారు. అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు బంక్ లోని ఉద్యోగులు పోలీసులకు వెల్లడించారు. అక్కడా ఎనిమిది లీటర్ల పెట్రోల్ పోయించుకన్నాడని తెలిపారు. అప్పటికే ప్రవీణ్ చేతులపై గాయాలు కనిపించాయని, బైక్ హెడ్లైడ్ ఊడిపోయి ఉందని పోలీసులకు వెల్లడించారు. ఆ తరువాత విజయవాడలోని దుర్గగుడి ఫ్లై ఓవర్, రాజీవ్ గాంధీ పార్కు, నెహ్రూ బస్ స్టేషన్ మీదుగా బెంజిసర్కిల్ రెండో ఫ్లైఓవర్ ఎక్కి మహానాడు జంక్షన్ కు చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహానాడు జంక్షన్ కు చేరుకున్నాక ప్రవీణ్ కాసేపు మాయం అయ్యారు. మహానాడు కూడలి - రామవరప్పాడు రింగ్ కు మధ్యలో ఏదో జరిగిందని పోలీసులు అనుమానించారు. వోక్స్ వ్యాగన్ షోరూమ్ కు ఎదురుగా నేషనల్ హైవేపై ఆయన బుల్లెట్ పై నుంచి పడిపోయారు. అక్కడే ఉన్న ఆటోడ్రైవర్లు రింగ్ లో డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుకు విషయం చెప్పారు. వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకుని ప్రవీణ్ ను పైకి లేపి పక్కన ఉన్న రెయిలింగ్ వద్ద కూర్చోబెట్టారు. మెల్లిగా ఆయన్ను ట్రాఫిక్ బూత్ దగ్గరకు తీసుకువచ్చి ముఖం కడుక్కోవడానికి ప్రవీణ్ కు ట్రాఫిక్ ఎస్ఐ నీళ్లు ఇచ్చారు. ఆ తర్వాత బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి 8.20 గంటల వరకు పాస్టర్ ప్రవీణ్ నిద్రపోయారు. నిద్రలేచాక మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని ఎస్ఐ ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత ఇన్నోటెల్ హోటల్ పక్కన ఉన్న టీస్టాల్ వద్దకు తీసుకెళ్లి టీ తాగించారు. టీ తాగిన తర్వాత ప్రవీణ్ బుల్లెట్ పై ఏలూరు వైపుగా బయల్దేరారు. టోల్ గేట్లు దాటుకుని ఏలూరు చేరుకున్నాక మళ్లీ అక్కడ టానిక్ వైన్స్ లో రూ.350 పెట్టి మద్యం కొన్నారు.
చిక్కుముడులు వీడుతోన్న పాస్టర్ ప్రవీణ్ కేసు ?
March 31, 2025
0
Tags