కేటీఆర్‌ వ్యాఖ్యలతో తెలంగాణ శాసనసభలో దుమారం !

Telugu Lo Computer
0


తెలంగాణ శాసనసభలో భారాస ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. పనులు కావాలంటే కాంగ్రెస్‌ నేతలు 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారాస సభ్యులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. దీనిపై భారాస సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఇటు కాంగ్రెస్‌, అటు భారాస సభ్యుల ఆందోళనతో సభలో వాతావరణం వేడెక్కింది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని భట్టి విక్రమార్క సవాల్‌ విసిరారు. లేదంటే సభలో క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. భారాస సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైకు ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. కేటీఆర్ గౌరవంగా మాట్లాడతారని ఊహించానని, సభనే కాదు, రాష్ట్రాన్నే ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. మరోవైపు కేటీఆర్‌ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు సభాపతి తెలిపారు. ఆ తర్వాత భారాస సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం వద్ద వారు నిరసనకు దిగారు. 20, 30 శాతం ప్రభుత్వమంటూ నినాదాలు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)