ఉత్తరప్రదేశ్‌ లో 'కుక్రైల్‌ నైట్‌ సఫారీ, అడ్వెంచర్‌ పార్క్‌ !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం 'కుక్రైల్‌ నైట్‌ సఫారీ, అడ్వెంచర్‌ పార్క్‌' పేరిట దేశంలోనే తొలిసారి ఈ తరహా పార్క్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. పర్యటక అభివృద్ధితోపాటు పచ్చదనం పెంపు, వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యంగా రూ.1500 కోట్లతో రెండు దశల్లో దీన్ని అభివృద్ధి చేయనుంది. వచ్చే నెలలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. లఖ్‌నవూలో కుక్రైల్‌ రక్షిత అటవీ ప్రాంతం సమీపంలో దీన్ని అభివృద్ధి చేయనుంది. జీవవైవిధ్యానికి పేరుపొందిన ఈ ప్రాంతం.. వివిధ రకాల వృక్ష, జీవజాలానికి నిలయంగా ఉంది. రూ.631 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న తొలి దశ పనుల్లో భాగంగా నైట్‌ సఫారీ, అడ్వెంచర్‌ పార్క్‌కు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ఎన్‌క్లోజర్ల ఏర్పాటు, పర్యటకులకు సౌకర్యాలు వంటివాటిపై దృష్టి సారించనున్నారు. 24 నెలల్లో పనులు పూర్తవుతాయని భావిస్తున్నారు. సహజమైన చీకటి వాతావరణం నేపథ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన లైటింగ్ వ్యవస్థల ఏర్పాటు, పర్యావరణహితమైన ఈవీ వాహనాలు, పక్షి ప్రేమికుల కోసం ప్రత్యేక విభాగాలు, వన్యప్రాణుల సంరక్షణ గురించి అవగాహన కల్పించేందుకు సమాచార కేంద్రాలు, సఫారీ థీమ్‌ వసతి సౌకర్యాలు, ట్రామ్‌ సర్వీసు వంటివి కల్పించనున్నారు. సింహాలు, చిరుతలు, కృష్ణ జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, హైనా తదితర జంతువులు, వివిధ రకాల పక్షులు, సరీసృపాల కోసం 38 ఎన్‌క్లోజర్ల ఏర్పాటు, ఆర్ట్‌ గ్యాలరీ, సాహస క్రీడలు, వెటర్నరీ హాస్పిటల్‌, 7డీ థియేటర్‌ వంటివి ఏర్పాటు చేయనున్నారు. వన్యప్రాణులు, సాహసాలు, సురక్షిత సౌకర్యాల మేళవింపుగా సరికొత్త పర్యాటక ఆకర్షణ అందించాలన్న లక్ష్యంతో నైట్‌ సఫారీ, అడ్వెంచర్‌ పార్క్‌ను యూపీ సర్కారు అభివృద్ధి చేయనుంది. ఎకో-టూరిజం, జీవవైవిధ్య సంరక్షణను ప్రోత్సహించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా ఇది నిలుస్తుందని చెబుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)