ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత టీమిండియా

Telugu Lo Computer
0


సీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. అసాధారణ ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా టైటిల్ ముద్దాడింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.  బౌండరీతో విజయలాంఛనాన్ని పూర్తి చేసిన రవీంద్ర జడేజా.. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలతో కలిసి గంగ్నమ్ స్టైల్ డ్యాన్స్ చేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వికెట్లతో దాండియా ఆడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ హగ్ చేసుకొని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత ఆటగాళ్లకు సందడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. మైకేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్), డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(2/45), కుల్దీప్ యాదవ్(2/40) రెండేసి వికెట్లు తీయగా, మహమ్మద్ షమీ(1/74), రవీంద్ర జడేజా(1/30) తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో) శతకం చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 34 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ (2/46), మైకేల్ బ్రేస్‌వెల్(2/28) రెండేసి వికెట్లు తీయగా.. రచిన్ రవీంద్ర, కైల్ జెమీసన్ చెరో వికెట్ పడగొట్టాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)