9 నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం !

Telugu Lo Computer
0

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 9వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి. 13వ తేది వరకు స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఆనందవిహారం చేస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశినాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి. ఇందుకోసం ఇంజినీరింగ్ అధికారులు తెప్పను సిద్ధం చేసి విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. స్వామి వారి పుష్కరిణిని అందంగా అలంకరించారు. తెప్ప చుట్టూ నీటి జల్లులు (షవర్‌) పడేలా ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవాల్లో అలంకరణ కోసం సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ వినియోగిస్తారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుంచి జరుగుతున్నాయి. సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో ''నీరాళి మండపాన్ని'' నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లల్లో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి. తొలిరోజు సాయంత్రం సీత ,లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడవీధులలో ప్రదక్షిణగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు తెప్పపై మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు. తెప్పోత్సవాల కారణంగా మార్చి 9, 10వ తేదీల్లో సహస్రదీపాలంకారణ సేవ, మార్చి 11, 12, 13 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారణసేవను రద్దు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)