హైదరాబాద్-విజయవాడ రూట్‌లో ప్రయాణించే వారికి టీజీఎస్‌ఆర్టీసీ రాయితీ !

Telugu Lo Computer
0


హైదరాబాద్-విజయవాడ రూట్ లో ప్రయాణించే ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. లహారి- నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం, రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం https://tgsrtcbus.in అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలని సూచించింది. ఈ విషయాన్ని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. హైదరాబాద్- విజయవాడ రూట్ లో ప్రయాణించే వారికి టికెట్లపై డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. అదే రూట్ లో తెలంగాణలోనే రెండో అతిపెద్ద గొల్లగట్టు (పెద్దగట్టు) జాతర సూర్యాపేటలో ఘనంగా జరుగుతోంది. తెలంగాణలోని నలుమూలల నుంచి భక్తులు ఈ జాతరకు వెళ్లే అవకాశం ఉంది. గొల్లగట్టు జాతరను దృష్టి పెట్టుకున్న ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. హైదరాబాద్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు, ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధికంగా వెళ్లే వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి దేవాలయాలకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. గత సంవత్సరం కంటే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు చేయాలన్నారు. బస్టాండ్ ల వద్ద అధిక రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)