లవ్ జిహాద్‌ను అడ్డుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది. ప్రేమ పేరుతో మత మార్పిడులకు పాల్పడుతున్న ఘటనలను అడ్డుకోవడానికి ఏడుగురు సభ్యులతో ఓ కమిటీని వేసింది. మహారాష్ట్ర డీజీపీ సంజయ్ వర్మ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. బలవంతపు మత మార్పిడులకు సంబంధించి వేర్వేరు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాలు, ఈ తరహా ఘటనలను అడ్డుకొనేందుకు న్యాయపరంగా ఉన్న అవకాశాలను ఈ కమిటీ ప్రభుత్వానికి తెలియజేయనుంది. మహారాష్ట్రకు చెందిన శ్రద్ధా వాకర్‌ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా 2022లో ముక్కులుగా చేసి అంతమొందించాడు. దీంతో అప్పట్లో లవ్ జిహాద్ అంశం తెరపైకి వచ్చింది. హిందూ అమ్మాయిల్ని ప్రేమ పేరుతో వివాహం చేసుకుని మత మార్పిడులకు పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అప్పట్లో దీనిపై తీవ్రంగా చర్చ జరిగింది. ఈ అంశంపై తాజాగా అధికారంలోకి వచ్చిన భాజపా ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వేయడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. రాష్ట్రంలోని సమస్యలపై దృష్టి సారించాలని ఎన్సీపీ (శరద్ పవార్) నేత సుప్రియా సూలే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ప్రేమ, పెళ్లి అనేవి వ్యక్తిగత వ్యవహారాలని పేర్కొన్నారు. ముస్లింలను వేధించడం, మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందంటూ సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు ఆజ్మీ పేర్కొన్నారు. 'లవ్ జిహాద్' అనేది ఓ అపోహ మాత్రమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే హుస్సేన్ దల్వాయి అన్నారు. దేశంలో ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పిస్తోందని గుర్తు చేశారు. అయితే, దేశంలోనూ, మహారాష్ట్రలోనూ ఇలాంటి లవ్ జిహాద్ కేసులు బోలెడని భాజపా ఎమ్మెల్యే మంగళ్ లోధా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
మహారాష్ట్రలో 'లవ్ జిహాద్'పై ఏడుగురు సభ్యులతో కమిటీ !
February 15, 2025
0
Tags