నాటోలో సభ్యత్వం విషయాన్ని ఉక్రెయిన్ మర్చిపోవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఆయన అధికారం చేపట్టాక తొలిసారి తన కార్యవర్గంతో సమావేశమయ్యారు. దీనికి డోజ్ సారథి మస్క్ సహా పలువురు కీలక సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ సమస్యపై ట్రంప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ''నాటోనా..? దానిని మీరు మర్చిపోవచ్చు. అసలు ఈ సంక్షోభం మొత్తం దాంతోనే మొదలైంది. మేము అత్యుత్తమమైన పనే చేయాలనుకుంటున్నాం. ఇద్దరికీ బెస్ట్ డీల్ కుదురుస్తాం. ముఖ్యంగా ఉక్రెయిన్‌కు మంచి సంధి కుదిరేటట్లు చేసి కోల్పోయిన దానిలో వీలైనంత ఎక్కువ వెనక్కి ఇప్పిస్తాం'' అని పేర్కొన్నారు. అదే సమయంలో శాంతి కోసం పుతిన్ కూడా కొన్ని రాయితీలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు ఖనిజాలపై అమెరికాతో ఒప్పందం కుదుర్చుకొనేందుకు శుక్రవారం ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ వాషింగ్టన్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ''అది అరుదైన ఖనిజాలపై చేసుకొనే చాలా పెద్ద ఒప్పందం'' అని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుమించి డీల్ గురించి ఆయన ఏమీ వెల్లడించలేదు. తొలుత ఈ డీల్‌కు అంగీకరించని ఉక్రెయిన్.. తాజాగా కొన్ని సవరణలతో ఆమోదించినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా తమకు అమెరికా నుంచి సైనిక సాయం ఆగిపోకుండా చూసుకోవచ్చని ఉక్రెయిన్ ఆశిస్తోంది.
రష్యా, ఉక్రెయిన్ లకు బెస్ట్ డీల్ కుదురుస్తాం : డోనాల్డ్ ట్రంప్
February 27, 2025
0
Tags