27 ఏళ్ల పాటు కొరుకుడు పడని ఢిల్లీ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది. మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కింది 22 స్థానాలే. మొత్తంగా బీజేపీకి పోల్ అయిన ఓట్ల శాతం 45.56. రెండు శాతం ఓట్లతో వెనుకంజ వేసింది ఆప్. 43.57 శాతానికి సరిపెట్టుకోవాల్సొచ్చింది. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జీరో అయింది. 6.34 శాతం ఓట్లకే పరిమితం అయింది. జనతాదళ్ (యునైటెడ్) ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఈ ఘోర ఓటమి అనంతరం ముఖ్యమంత్రి ఆతిషి తన పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి కిందటే రాజ్ నివాస్‌లో లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిశారు. తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. దీన్ని వెంటనే ఆమోదించారు ఎల్జీ. 20 నిమిషాల్లోనే రాజీనామా ప్రక్రియ పూర్తయింది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్పందించారు. అహంకారపూరిత పరిపాలనే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి దారి తీసిందని విశ్లేషించారు. ఈ ఓటమి ప్రభావం ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియాపై పడుతుందని అనుకోవట్లేదని వ్యాఖ్యానించారు. ఈరోజు ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి ఆప్ ఓడిపోయిందని, పరోక్షంగా ఈ పరాజయానికి కారణమైందంటూ వస్తోన్న వార్తలను తోసిపుచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో తమకోసం తాము పోటీ చేశామని వివరించారు. ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నో పార్టీలు, అభ్యర్థులు పోటీలో దిగుతుంటారని గుర్తు చేశారు. ఎవరి లబ్ది కోసమో లేక ఎవరిని దెబ్బతియడానికో తాము పోటీ చేయలేదని రేణుకా చౌదరి అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తన అహంకారానికి తాను బలైందని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పామనీ గుర్తు చేశారు. ఓడిపోయినప్పటికీ- ఆప్ పట్ల తమ గౌరవం తగ్గదని, దేశ ప్రయోజనాల కోసం మిత్రపక్షంగానే ఆదరిస్తామని ఆమె తేల్చి చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం సమష్టిగా పోరాడతామని అన్నారు.
అహంకారపూరిత పరిపాలనే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి దారితీసింది : రేణుకా చౌదరి
February 09, 2025
0
Tags