మీరా రాథోడ్ అనే మహిళ తాజ్ మహల్ లోపల చిన్న శివలింగం పెట్టి, దానికి జలాభిషేకం చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. వీడియోలోని మహిళ అఖిల భారత హిందూ మహాసభ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మీరా రాథోడ్‌గా గుర్తించారు. ఆమె లింగానికి అభిషేకం చేసిన తర్వాత అగరబత్తులు వెలిగించి, ఇతర మతపరమైన హిందూ మతాచారాలను నిర్వహించినట్లు వీడియోలు చూస్తే తెలుస్తోంది. ప్రయాగ్‌రాజ్ సంగమం నుంచి గంగానది పవిత్ర జలాన్ని తీసుకువచ్చినట్లు మీరా తెలిపింది. తాజ్ మహల్‌లో పూజలు నిర్వహించడానికి ఒక చిన్న శివలింగాన్ని కూడా వెంట తీసుకువెళ్లినట్లు పేర్కొంది. తాజ్ మహల్ నిజానికి తేజో మహాలయ అని మీరా చెబుతోంది. దాన్ని 'శుద్ధి' చేయడానికి శివలింగం పెట్టి జలాభిషేకం చేశానని తెలిపింది. అంతకుముందు శ్రావణ మాసంలో అఖిల భారత హిందూ మహాసభ, ఇతర సంస్థలకు చెందిన మహిళలు తాజ్ మహల్ వద్ద గంగాజలం సమర్పించడానికి ప్రయత్నించారు. అయితే మీరా రాథోడ్ చేసిన పనులు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం తాజ్ మహల్ భద్రతపై ఆందోళనలు పెంచింది. ఇలాంటి ప్రాంతాలకు అగ్గిపుల్లలు, ధూపం కర్రలు, విగ్రహాలను తీసుకెళ్లడం లేదా పూజలు నిర్వహించడం నిషేధం. ఈ ఘటనపై తాజ్ మహల్‌లోని సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్ ప్రిన్స్ వాజ్‌పేయి 'ఈటీవీ భారత్'తో మాట్లాడారు. 'స్మారక చిహ్నం లోపల గంగాజలం, శివలింగానికి అభిషేకం చేసిన వీడియోలను అధికారులు పరిశీలిస్తున్నారు. సంఘటనను గమనించాం. భద్రతా లోపాలను గుర్తించే పనిలో ఉన్నాం. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నాం. సీఐఎస్‌ఎఫ్ నుంచి నివేదిక కోరుతాం. విచారణ తర్వాత కఠినమైన చర్యలు తీసుకుంటాం.' అని తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో అభిషేక్ సక్సేనా(@abhis303) అనే హ్యాండిల్‌లో ఈ వైరల్ వీడియో పోస్ట్ చేశారు. దీనికి 'మహాశివరాత్రి రోజున తాజ్ మహల్‌లో శివునికి అభిషేకం... మహిళ తనతో పాటు శివలింగాన్ని తీసుకువెళ్లింది, సంగమం నుంచి తెచ్చిన గంగాజలాన్ని సమర్పించింది' అనే క్యాప్షన్ రాశారు. నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఆమెను సమర్థిస్తుండగా, మరికొందరు తప్పు పడుతున్నారు. అదో సమాధి అని, అక్కడ పూజలు చేసి అపచారం చేశావని కొందరు కామెంట్ చేశారు. తాజ్ మహల్‌లో అలాంటివి ఎవరు అనుమతించారని, భద్రత ఎక్కడుందని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.
తాజ్ మహల్‌లో నిఘా వైఫల్యం : శివలింగానికి జలాభిషేకం !
February 27, 2025
0
Tags