అమెరికాలో అనవసర ఖర్చులకు కోత పెడుతున్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్) ముందుకు ఓ ప్రతిపాదన వచ్చింది. ఖర్చులు తగ్గించి మిగిలినదాంట్లో కొంత మొత్తాన్ని తీసి పన్ను చెల్లించేవారికి డోజ్ డెవిడెండ్ పేరిట 2026 జులై తర్వాత 5,000 డాలర్ల (రూ.4.3లక్షలు) చొప్పున చెక్కుల రూపంలో అందించాలని అజోరియా సంస్థ సీఈవో జేమ్స్ ఫిష్‌బ్యాక్ సూచించారు. ఆయన డోజ్‌కు బయట నుంచి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అమెరికా ఖర్చుల్లో 2 ట్రిలియన్ డాలర్ల కోత విధించే లక్ష్యంతో ట్రంప్ సర్కారు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ లెక్కన దానిలో 20 శాతం నగదు 7.9 కోట్ల పన్ను చెల్లింపుదారులకు పంచినట్లవుతుంది. ఈ ప్రతిపాదనకు డోజ్ సారథి మస్క్ స్పందిస్తూ ''ఈ విషయాన్ని అధ్యక్షుడితో మాట్లాడి చూద్దాం. ఎందుకంటే ప్రెసిడెంటే కమాండర్ ఇన్ చీఫ్. అందుకే ఇదంతా ఆయనపైనే ఆధారపడి ఉంది'' అని పేర్కొన్నారు. సోమవారం నాటికి డోజ్ వెబ్‌సైట్ ప్రకారం అమెరికాలో 55 బిలియన్ డాలర్లను మిగిల్చింది. ఇందుకోసం మోసాలకు అడ్డుకట్ట, కాంట్రాక్టుల రద్దు, లీజ్ క్యాన్సిలేషన్లు, ఆస్తుల విక్రయాలు, నిధుల రద్దు వంటి చర్యలు తీసుకొంది. మస్క్ బృందం దూకుడుపైనా విమర్శలూ వస్తున్నాయి. ప్రభుత్వ విభాగాల్లోని సమాచారాన్ని అడ్డుఅదుపు లేకుండా యాక్సెస్ చేస్తుండంతో పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. వైట్‌హౌస్‌లోని సీనియర్ సలహాదారుల మాదిరిగా స్వతహాగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకొనే అధికారం మస్క్‌కు లేదని వైట్‌హౌస్ వ్యవహారాల డైరెక్టర్ జోషువా ఫిషర్ పేర్కొన్నారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొనే 2026 జులై 4వ తేదీలోపు ఈ ఫెడరల్ బ్యూరోక్రసీని పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నది డోజ్ లక్ష్యం. తన పని పూర్తికాగానే ఈ విభాగం దానికి అదే డిలీట్ అయిపోతుందని గతంలో మస్క్ వెల్లడించారు. అమెరికా ఏటా 6.5 ట్రిలియన్ డాలర్ల వ్యయం చేస్తోంది. దీనిలో 2 ట్రిలియన్లను మిగిల్చడమే ఈ సంస్థ లక్ష్యం.
అమెరికాలో పన్ను చెల్లించే వారికి డెవిడెండ్ ఇవ్వాలని జేమ్స్ ఫిష్‌బ్యాక్ సూచన !
February 19, 2025
0
Tags