సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు !

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. పండుగ సందర్భంగా 6,432 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. ముఖ్యంగా జనవరి 10, 11, 12 తేదీల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఆ రోజుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. అంతే కాకుండా, తిరుగు ప్రయాణ రద్దీ కోసం జనవరి 19, 20 తేదీల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్‌లో ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి వంటి రద్దీ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం పండ్ల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయనుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా నడిచే ప్రత్యేక బస్సుల టికెట్ ధరలను ప్రభుత్వ జీవో ప్రకారం 1.50 వరకు సవరించినట్లు టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. ఈ సవరించిన చార్జీలు ప్రత్యేక బస్సులకు మాత్రమే వర్తిస్తాయి. జనవరి 10, 11, 12 తేదీలతో పాటు తిరుగు ప్రయాణానికి జనవరి 19, 20 తేదీల్లో కూడా ఈ చార్జీలు అమలులో ఉంటాయి. రెగ్యులర్ బస్సుల టికెట్ ధరలు యథావిధంగా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకం కింద పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం కొనసాగుతుందని టీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది. ప్రత్యేక బస్సుల ద్వారా పండుగ సమయంలో ప్రజలకు ఎటువంటి రవాణా ఇబ్బందులు తలెత్తకుండా టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. తిరుగు ప్రయాణంలో బస్సుల రద్దీ తగ్గినప్పటికీ, ఖాళీ బస్సులను తిరిగి సమయానికి వెనక్కి తీసుకొచ్చి అవసరమైన రూట్లలో నడిపేందుకు సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రత్యేక బస్సులకు ప్రయాణికులు www.tgsrtcbus.in వెబ్‌సైట్ ద్వారా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. అదనపు సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000 లేదా 040-23450033 సంప్రదించవచ్చు. ప్రత్యేక బస్సులు నడిపే సమయంలో వచ్చే డీజిల్ ఖర్చులు, నిర్వహణ ఖర్చుల కోసం 2003లో జీవో నంబర్ 16 ప్రకారం ప్రత్యేక బస్సుల టికెట్ ధరలను సవరించే వెసులుబాటును టీఎస్‌ఆర్టీసీకి ప్రభుత్వం కల్పించింది. ఈ సంక్రాంతికి ఐదు రోజులపాటు మాత్రమే సవరించిన టికెట్ ధరలు అమలులో ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది. సంక్రాంతి పండుగకు టీఎస్‌ఆర్టీసీ ఈ విధమైన సౌకర్యాలతో ప్రయాణికులకు మరింత సేవలందించాలని కృషి చేస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)