ఆంధ్రప్రదేశ్ లోని పలాస జీడి వ్యాపారులను విదేశీ జీడి పిక్కలు నిలువునా ముంచేశాయి. అధిక ధర చెల్లించి టాంజానియా నుంచి దిగుమతి చేసుకున్న జీడి పిక్కలకు స్థానిక మార్కెట్లో ఆ స్థాయిలో ధర కరువైంది. ఫలితంగా వ్యాపారులు బస్తాపై రూ.4వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది. దేశీయ పిక్కల ధరలు కూడా ఆశాజనకంగా లేవు. దీంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఈ సంకాంత్రికైనా ధరలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 400 జీడి పరిశ్రమలు ఉన్నాయి. ఏటా పలాస మార్కెట్‌కు టాంజానియా, ఐవిరికోస్ట్, ఘన, శ్రీలంకతో పాటు ఆఫ్రికా దేశాల నుంచి జీడి పిక్కలు తక్కువ ధరకు దిగమతి అవుతుంతాయి. ఇందుకోసం ప్రత్యేకంగా అంతర్జాతీయ బ్రోకర్లు ఉంటారు. వారి ద్వారా పిక్కలను రప్పించుకోవడం సాధారణం. ఈ క్రమంలో ఇక్కడ ధరలు స్థిరంగా ఉన్న సమయంలో కొందరు వ్యాపారులు టాంజానియా దేశం జీడి పిక్కలకు ఆర్డర్ పెట్టారు. టాంజానియా దేశ పిక్కలు బస్తా (80 కిలోలు) రూ.8వేల వరకూ లభిస్తుందని భావించి.. 20వేల టన్నుల వరకూ దిగుమతి చేసుకునేందుకు బ్రోకర్లకు ముందుగానే కొంతమేర నగదు చెల్లించారు. కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా ఆ పిక్కలు పలాస వ్యాపారుల వద్దకు వచ్చే సరికి జీఎస్‌టీతో సహా రూ.బస్తా (80 కిలోలు) రూ.17,500 ధర పడింది. అయితే, ప్రస్తుత మార్కెట్‌లో బస్తా ధర రూ.14,500వరకు ఉంది. దీంతో బస్తాకు రూ.3వేల వరకు వ్యాపారులు నష్టపోతున్నారు. జీడి పప్పు ధరలు తగ్గుముఖం పట్టడంతో అదనంగా మరో రూ.వెయ్యి వరకూ నష్టపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో విదేశీ పిక్కలతో వ్యాపారం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి నాటికి జీడిపిక్కల ధరలు పెరుగుతాయని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. స్థానికంగా లభించే జీడి పిక్కల ధర ఎక్కువగా ఉన్నా వాటిని నిల్వ చేసుకోక పోవడంతో పూర్తిగా కొరత ఏర్పడింది. కొందరు వ్యాపారులు మాత్రం స్థానిక పిక్కలను వేల బస్తాలు కొనుగోలు చేశారు. వారంతా నిర్భయంగా వ్యాపారాన్ని చేసుకుంటున్నారు.
పలాస వ్యాపారులను నష్టాల పాల్జేసిన విదేశీ జీడి పిక్కలు !
January 08, 2025
0
Tags