మచిలీపట్నం మసీదులో దుండగుల దుశ్చర్య !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం నగరంలోని బైపాస్‌రోడ్డు పంబలగూడెంలో ఉన్న బిలాల్‌ మసీదులో మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మసీదు పెద్దల సమాచారం మేరకు గుర్తు తెలియని వ్యక్తులు మసీదులోకి చొరబడి ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌, ఇతర పవిత్ర గ్రంథాలను చెల్లాచెదురు చేశారు. ఖురాన్‌, పవిత్ర గ్రంథాలు ఉన్న ప్రదేశంలో చెప్పులను విడిచారు. మసీదులోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, టాయిలెట్‌లో కుళాయిల్లోని నీటిని వదిలేశారు. ఈ మసీదులో ముస్లింలు ప్రార్థనలు చేస్తూ పవిత్ర స్థలంగా భావిస్తారు. ఈ స్థలంలో ఇలా జరగటంతో స్థానిక ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తాము, హిందువులు, క్రైస్తవులు సామరస్యంగా వ్యవహరిస్తూ ఉంటామన్నారు. ఎవరితో ఎలాంటి విభేదాలు లేవని కానీ ఈ ఘటన జరగటం తమ మనోభావాలను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన మునుపెన్నడూ జరగలేదని ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. మసీదును డీఎస్పీ పరిశీలించారు. పోలీస్‌ జాగిలంతో సోదాలు నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు షేక్‌ సలార్‌దాదా, నాయకుడు అన్వర్‌హుస్సేన్‌, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ షేక్‌ అచ్చెబా, ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎండీ సద్‌రుద్దీన్‌ ఖురేషి తదితరులు మసీదును సందర్శించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)