ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల సంఘం పనితీరుపై ప్రధాని ప్రశంసలు, కాంగ్రెస్‌ నాయకులు విమర్శలు !

Telugu Lo Computer
0


జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల సంఘం పనితీరుపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించగా, కాంగ్రెస్‌ నాయకులు విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా 'జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది శక్తిమంతమైన మన ప్రజాస్వామ్యానికి గుర్తు. ఇది ప్రతి పౌరుడికి తన ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది. మన భవిష్యత్తుకు ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ విషయంలో ఎన్నికల సంఘం పనితీరును అభినందిస్తున్నా' అని రాసుకొచ్చారు. ఈ పోస్టుకు ఇటీవల మన్‌ కీ బాత్‌లో చేసిన ప్రసంగాన్ని జోడించారు. అందులో పోలింగ్‌ ప్రక్రియను ఆధునికీకరించడంతో పాటు ప్రజల శక్తిని బలోపేతం చేసేందుకు ఈసీ కృషి చేస్తుందని ప్రశంసలు కురిపించారు. ఇదిలాఉండగా ఈసీ పనితీరుపై కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తంచేశారు. గత పదేళ్లుగా భారత ఎన్నికల సంఘం పనితీరు క్షీణించిందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అయినప్పటికీ మన ఎన్నికల ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకొని, ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రతి పౌరుడికి ఓటుహక్కు అనేది పట్టణ స్థాయి నుంచి అట్టడుగు స్థాయి వరకు విస్తరించిందని కొనియాడారు. అయితే, మన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి మన సంస్థల స్వతంత్రతను కాపాడుకోవడం ముఖ్యమని హెచ్చరించారు. ఇక, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ సైతం ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తూ పోస్టు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)