అరటి పండ్లు తియ్యగా ఉంటాయి. వీటిలో నేచురల్ షుగర్స్, కార్బోహైడ్రెట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి షుగర్ లెవెల్స్ పెరుగుతాయని మధుమేహ బాధితులు వీటికి దూరంగా ఉంటారు. కానీ రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచకుండా నియంత్రించే గుణాలు కూడా దీంట్లో ఉంటాయి. అందుకే వీటిని ఎవరైనా తినొచ్చు. అరటి పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను మనం తినే ఆహారం ఎంత వేగంగా పెంచుతుందో తెలియజేసేదే గ్లైసెమిక్ ఇండెక్స్. ఇది తక్కువగా ఉంటే షుగర్ లెవెల్స్ నెమ్మదిగా పెరుగుతాయి. అరటి పండ్ల గ్లైసెమిక్ ఇండెక్స్ 42 నుంచి 58 మధ్య ఉంటుంది. పండిన తీరును బట్టి ఇది మారుతుంది. అరటి పండు పండిన కొద్దీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. పక్వం చెందని పండ్లలో పిండిపదార్థాలు ఎక్కువగా, చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. అది పండుతున్న కొద్దీ పండిపదార్థం చక్కెరగా మారుతుంది. వీటిని పరిమితంగా తింటే ఎలాంటి సమస్య ఉండదు. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర మెల్లిగా కలుస్తుంది. ఇది ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరగడాన్ని నియంత్రిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు అరటిపండ్లు తినొద్దనే అపోహ చాలా మందిలో ఉంది. నిజానికి ఇది బరువు తగ్గడానికి కూడా సహాయం చేస్తుంది. అరటిలో ఉండే ఫైబర్, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫలితంగా కేలరీలు కరిగి బరువు తగ్గడానికి కారణమవుతుంది. మరోవైపు స్వీట్ తినాలనే కోరికను తగ్గిస్తుంది. దీని కేలరీలను పెంచే ఇతర తీపి పదార్థాలకు దూరంగా ఉండొచ్చు.
మధుమేహం - అరటి పండు !
January 10, 2025
0
Tags