డొనాల్డ్‌ ట్రంప్‌ నిబంధనలకు కొలంబియా అంగీకారం ?

Telugu Lo Computer
0


మెరికాలో ఉన్న అక్రమ వలసదారులపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కఠినంగా వ్యవహరిస్తూ ప్రత్యేక విమానాల్లో వారిని స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చర్యలను ముందుగా వ్యతిరేకించిన కొలంబియా అనంతరం వెనక్కి తగ్గి అగ్రరాజ్యం పెట్టిన నిబంధనలకు అంగీకరించిందని వైట్‌హౌస్‌ పేర్కొంది. కొలంబియా వెనక్కి తగ్గి స్వదేశానికి తిరిగి వచ్చిన పౌరులను ఆహ్వానించడంతో తాము ఆ దేశంపై విధించిన సుంకాలు, పలు ఆంక్షలను నిలిపివేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. ''అమెరికా సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. యూఎస్‌లో చట్టవిరుద్ధంగా ఆశ్రయం పొందుతున్న తమ పౌరులను వెనక్కి పిలుపించుకోవడానికి ప్రపంచ దేశాలు తగిన చర్యలు తీసుకొని మాకు సహకరించాలి'' అని వైట్‌హౌస్‌ పేర్కొంది. అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో వారివారి స్వదేశాలకు పంపడానికి అగ్రరాజ్యం అనుసరిస్తున్న తీరుపై పలు దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇలా వలసదారులను తీసుకొచ్చే విమానాలను తమ దేశంలోకి అనుమతించమని కొలంబియా తేల్చి చెప్పింది. ''కొలంబియా వలసదారులను తీసుకువచ్చే అమెరికా విమానాలను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నా' అని ఆ దేశాధ్యక్షుడు గుస్తావో పెట్రో ఇటీవల పేర్కొన్నారు. వలసదారులను గౌరవంగా పంపించేందుకు అమెరికా నిబంధనలు రూపొందిస్తేనే వాటిని అనుమతిస్తామన్నారు. ఇప్పటికే అమెరికా సైనిక విమానాలను వెనక్కి పంపించినట్లు చెప్పారు. వలసదారులను నేరస్థులుగా చిత్రీకరించకుండా, అమెరికా పౌర విమానాల్లో పంపిస్తేనే వాటిని తమ దేశంలోకి అనుమతిస్తామని పెట్రో పేర్కొన్నారు. దీనిపై ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. కొలంబియా ఉత్పత్తులపై సుంకాలు 50 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. కొలంబియన్ ప్రభుత్వ అధికారుల వీసాలను వెంటనే రద్దు చేస్తానని అన్నారు. ఈ చర్యలు ఆరంభం మాత్రమే అని.. తమ నిబంధనలను పాటించి ప్రపంచ దేశాలు తమ పౌరులను తిరిగి వెనక్కి ఆహ్వానించకపోతే వారిపై మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. మరోవైపు అమెరికా అనుసరిస్తున్న విధానంపై బ్రెజిల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలా వలసదారుల చేతులకు సంకెళ్లు వేసి పంపించడాన్ని తీవ్రంగా పరిగణించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)