కెంపయ్య అనే పోలీసు అధికారిని అడ్డం పెట్టుకుని సిద్ధరామయ్య నన్ను అరెస్టు చేయాలని గతంలో పథకం పన్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. అయితే తనను ఒక్కరోజు అయినా జైలులో పెట్టాలని అనుకున్న సీఎం సిద్దరామయ్య కోరిక మాత్రం ఇంత వరకు నెరవేరలేదని గతంలో జరిగిన ఓ విషయాన్ని మాజీ సీఎం, జేడీఎస్ దళపతి హెచ్ డీ కుమారస్వామి బహిరంగంగా చెప్పారు. ఈ విషయమై బెంగళూరులో మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి నన్ను కనీసం ఒక్కరోజైనా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని సీఎం సిద్దరామయ్య ప్లాన్ చేసి అదే విషయం పోలీసు అధికారి కెంపయ్యకు చెప్పారని, ఆ సమయంలో విచారణకు వెళ్లవద్దని మా న్యాయవాది సూచించారని, అప్పట్లో సిద్దరామయ్య ప్లాన్ రివర్స్ అయ్యిందని కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ఆరోపించారు. ఇప్పుడు 2,900 మహిళలు ఉన్న కేసు అని అంటున్నారని, అయి0తే ఇప్పటి వరకు ఎలాంటి కేసు లేదని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మీడియాకు చెప్పారు. హాసన్ పెన్‌డ్రైవ్ కేసులో అసలు సూత్రధారి అయిన కారు డ్రైవర్ కార్తీక్‌ను ఓ ప్రైవేట్ ఛానెల్‌లో కూర్చోబెట్టి శిక్షణ ఇచ్చి మాట్లాడిస్తున్నారని, ఇలాంటి సీన్లు చూస్తుంటే ఈ కేసు విచారణ ఏ దిశగా సాగుతుందో అర్థమవుతోందని మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు. హాసన్ కేసును విచారించేందుకు సిట్‌ను ఏర్పాటు చేశారని, ఆ సిట్ పని చేస్తోందా లేదా అని అనుమానంగా ఉందని కుమారస్వామి ఆరోపించారు. అయితే ప్రత్యేక దర్యాప్తు బృందానికి దొరకని కారు డ్రైవర్ కార్తీక్ ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడని, సిట్ కు చిక్కకుండా అతను ఓ ప్రైవేట్ టీవీ చానల్ కార్యాలయంలోకి ఎలా వెళ్లాడని హెచ్ డీ కుమారస్వామి కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ ను ప్రశ్నించారు. కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర్ ను నేను ఒకటే అడగాలనుకుంటున్నానని, మీ విచారణ కేవలం మా అన్న హెచ్ డీ రేవణ్ణపై కేంద్రీకరించబడిందని ఆరోపించారు. అయితే ఆ వీడియోలు విడుదల చేసిన వారిని ఎందుకు వదిలేశారు? వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని మాజీ సీఎం కుమారస్వామి ప్రశ్నించారు. ఇప్పటి వరకు మీరు చేసిందేమీ లేదని కుమారస్వామి కర్ణాటక ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు.
నన్ను జైల్లో పెట్టాలని సీఎం సిద్ధరామయ్య ప్లాన్ చేశారు !
May 08, 2024
0
Tags