కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌పై హర్షం !

Telugu Lo Computer
0


ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఆప్‌ నేతలు స్పందిస్తూ  ''రాజ్యాంగాన్ని విశ్వసించే ప్రతిఒక్కరికీ సుప్రీంకోర్టు తీర్పు ఒక ఆశాకిరణం లాంటిది. మా పార్టీ, ఢిల్లీ ప్రజల తరఫున కృతజ్ఞతలు. ఇది కేజ్రీవాల్‌కు దక్కిన ఊరట మాత్రమే కాదు, సత్యానికి దక్కిన విజయం కూడా. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి దక్కిన భారీ విజయం. ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో కోర్టు కీలక పాత్ర పోషించింది. అసాధారణ పరిస్థితుల్లో ఈ బెయిల్ మంజూరైంది'' అని హర్షం వ్యక్తం చేశారు. ఒక గొప్ప ఉద్దేశం కోసం ఆయన బయటకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాగే పలువురు విపక్ష 'ఇండియా' కూటమి నేతలు కూడా ఈ బెయిల్‌పై స్పందించారు. ''కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత ఎన్నికల సమయంలో ఇదెంతో ఉపయోగకరంగా ఉంటుంది'' అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేడా మాట్లాడుతూ..'' కేజ్రీవాల్‌కు బెయిల్ ఇస్తూ సుప్రీం ఇచ్చిన ఉత్తర్వులను మేం స్వాగతిస్తున్నాం. ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు కూడా తగిన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం'' అని అన్నారు. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో దిల్లీ సీఎం జూన్‌ 1 వరకు బెయిల్‌ ఇస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించిన సంగతి తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)