ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం వేటు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, అన్నమయ్య జిల్లా రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. తెలుగుదేశం పార్టీ నేతలు డీఎస్పీ రాఘవరెడ్డిపై ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన ఈసీ వెంటనే బదిలీ చేసింది. తమ కింద అధికారులకు ఆ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు ఇద్దరు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీచేశారు. వీరిని వెంటనే పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అనంతపురం డీఎస్పీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ ప్రతాపరెడ్డిని సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు. అనంతపురం టీవీ టవర్ సమీపంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. అయితే డీఎస్పీ మాత్రం ఉద్దేశపూర్వకంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. వీరిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో డీఎస్పీపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఎన్నికల సమయంలో తటస్థంగా వ్యవహరించకుండా అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ ఇంటెలిజెన్స్‌ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాలను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. వీరికి ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని స్పష్టం చేసింది. వీరిద్దరినీ వెంటనే విధుల నుంచి తప్పించాలని, కొత్తవారిని నియమించేందుకు పేర్లు సూచించాలని కేంద్ర ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వైఎస్ జగన్ పై రాయితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. భద్రతాపరమైన వైఫల్యంవల్లే ఇది జరిగిందని భావించిన ఈసీ వారిపై బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)