ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పవన్‌ కల్యాణ్‌ లేఖ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్  ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓ లేఖను విడుదల చేశారు. 'ప్రియమైన ఏపీ ప్రజలకు నమస్కారం.. ఈనెల 13న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూపించిన ప్రేమకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు. సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున భాగస్వాములైనందుకు నా అభినందనలు. అత్యధికంగా 81.86శాతం మంది ఓట్లు వేసి రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందం కలిగించింది. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం అధికారులు, అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అలాగే, ఎన్నికల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా, పౌర సంఘాలు పోషించిన బాధ్యతాయుతమైన పాత్రకు కృతజ్ఞతలు'' అని లేఖలో పేర్కొన్నారు. పిఠాపురం ప్రజలకు పవన్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురం అభ్యర్థిగా పోటీ చేసిన తనను ఆదరించి అండగా నిలిచి ప్రజలు చూపించిన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తాను పోటీ చేస్తున్నట్లు తెలియగానే ఎంతో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ తన సీటు త్యాగం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించిన పిఠాపురం తెదేపా ఇంఛార్జి ఎస్.వి.ఎస్. ఎన్. వర్మ, ఆయన అనుచరులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ ఎన్నికల్లో వర్మ అందించిన సహకారం మరువలేనిదన్నారు. భవిష్యత్తులో కచ్చితంగా ఆయన చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజల తరపున బలంగా పని చేస్తారని విశ్వసిస్తున్నట్లు పవన్‌ పేర్కొన్నారు. అలాగే రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం వర్మ అనుభవాన్ని వినియోగించుకుంటూ కలిసికట్టుగా ముందుకు వెళ్తామన్నారు. పిఠాపురంలో నేను పోటీచేస్తున్నానని తెలియగానే అండగా ఉండేందుకు తమ సినిమాలు, ధారావాహికలకు విరామం ఇచ్చి ముందుకు వచ్చి పిఠాపురంలో ప్రతీ గడపకు వెళ్లి ప్రచారం చేసిన సినీ, బుల్లితెర నటీనటుల ప్రేమ నన్ను కదిలించింది. నా విజయాన్ని కాంక్షిస్తూ ఎంతోమంది అగ్ర కథానాయకుల నుంచి, నవతరం నటుల వరకు అందరూ మద్దతు ప్రకటించడం సంతోషాన్నిచ్చింది. ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అలాగే దేశ విదేశాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తరలివచ్చి తమ మాతృభూమి అభివృద్ధి ఆకాంక్షను వెల్లడించిన ఎన్నారై జనసైనికులకు నా అభినందనలు. పిఠాపురంలో మార్పు కోసం.. మార్పునకు ముందడుగు వేసేందుకు పనిచేసిన ప్రతీ ఒక్క నాయకుడికి, జనసైనికుడికి, వీరమహిళలకు, తెదేపా, భాజపా నాయకులు, కార్యకర్తలకు, పౌర సమాజానికి ధన్యవాదాలు తెలుపుతున్నా. రానున్న రోజుల్లో అందరినీ కలుపుకొంటూ పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని మాటిస్తున్నా'' అని లేఖలో పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)