ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయి తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అరవింద్ కేజ్రివాల్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేజ్రివాల్ ను అరెస్టు చేసిన ఈడీకి సుప్రీంకోర్టు కీలక ప్రశ్న వేసింది. కేజ్రివాల్ ను సార్వత్రిక ఎన్నికలకు ముందే ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. దీనికి ఈడీ వద్ద తక్షణ సమాధానం లేదు. దీంతో మే 3న జరిగే తదుపరి విచారణలో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఎన్నికల వేళ తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రివాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా లిక్కర్ కేసులో జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ లేకుండా క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టవచ్చా లేదా అనే ప్రశ్న ఈడీ అరెస్టుతో తలెత్తుతోందని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. ఇదే బెంచ్ లో మరో న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా ఈడీ కేజ్రివాల్ ను అరెస్టు చేసిన సమయంపై ప్రశ్నిస్తూ.. జీవితం, స్వేచ్ఛ అనేవి అంతకంటే ముఖ్యమన్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఎలాంటి అటాచ్ మెంట్ చర్యలు కూడా తీసుకోలేదని, అలా చేసి ఉంటే కేజ్రివాల్ పాత్ర ఏముందో చెప్పాలని జస్టిస్ దీపాంకర్ దత్తా అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం సిసోడియా విషయంలో ఆధారాలు ఇచ్చిన ఈడీ.. కేజ్రివాల్ విషయంలో అలాంటి సాక్ష్యాలు ఇవ్వలేదని గుర్తుచేశారు. ఈ కేసులో విచారణ ప్రారంభానికి, అరెస్టుకు మధ్య ఇంత పెద్ద గ్యాప్ ఎందుకు వచ్చిందో వివరించాలని ఈడీని ఆదేశించింది.
సార్వత్రిక ఎన్నికలకు ముందే ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది ?
April 30, 2024
0