ఇజ్రాయెల్ దాడులతో గాజా వాసుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆకలి బాధను తీర్చేందుకు కొన్ని దేశాలు ముందుకొచ్చి ఎయిర్‌డ్రాప్‌ల ద్వారా ఆహార పొట్లాలను జారవిడుస్తున్నాయి. వీటిలో అమెరికా, జోర్డాన్, బెల్జియం, ఈజిప్ట్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఉత్తర గాజాలోని ఒక శిబిరం వద్ద ఆహార ప్యాకెట్ల కోసం ఎదురు చూస్తున్న పౌరులపై పారాచ్యూట్ కూలి ఐదుగురు మృతి చెందగా.. పది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆల్-షిఫా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పాలస్తీనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్‌డ్రాప్ ఆకలి సమస్యకు పరిష్కారం కాదని.. ఇది పనికిరాని చర్య అంటూ మండిపడింది. వాయు మార్గాన చేసే సాయం ప్రజలకు ముప్పు కలిగిస్తుందని హెచ్చరించినట్లు తెలిపింది. మానవతా సాయం పేరిట ప్రచారం పొందుతున్నాయంటూ ఆరోపించింది. ఎయిర్‌డ్రాప్ ప్రమాదానికి దారి తీస్తుందని.. రఫా సరిహద్దు నుంచి మరిన్ని ఆహార ట్రక్కులను అనుమతించాలని ఇజ్రాయెల్‌ను ఐక్యరాజ్యసమితి కోరిన విషయం తెలిసిందే. కూలిన పారాచ్యూట్ తాము జారవిడిచింది కాదంటూ జోర్డాన్, అమెరికా సైన్యాలు ప్రకటించాయి. బెల్జియం, ఈజిప్ట్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ కలసి చేపట్టిన సాయంలో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నాయి.
గాజాలో పారాచ్యూట్ కూలి ఐదుగురు మృతి !
March 09, 2024
0
Tags