అక్టోబరు 31 నాటికి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రతి బస్సుకు ముందు, వెనుక భాగంలో కెమెరాలను అమర్చుతున్నట్లు ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి ఆంటోనీ రాజు తెలిపారు. బస్సు లోపల, వెలుపల జరిగే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘలను సులువుగా గుర్తించడానికి కెమెరాలు ఉపయోగకరంగా ఉంటాయని ఆయన చెప్పారు. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ బస్సులు సహా వేలాది ప్రైవేటు వాహనాలు రాష్ట్రంలో రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. వాటి కోసం భారీగా కెమెరాలను సేకరించాల్సి రావడంతో ఈ ప్రక్రియ కొంత ఆలస్యమైందని చెప్పారు. 'ఏదేమైనప్పటికీ అక్టోబరు 31వ తేదీ తుది గడువు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించం. అప్పట్లోగా బస్సుల్లో కెమెరాలు ఏర్పాటు చేయాలని' ఆయన స్పష్టం చేశారు. కేరళలో రహదారి భద్రతా ప్రమాణాలను పెంపొందించడానికి ప్రభుత్వం మరో నిర్ణయం కూడా తీసుకుంది. నవంబరు 1వ తేదీ నుంచి ఆ రాష్ట్రంలో ప్రయాణించే భారీ వాహనాల్లో డ్రైవర్లు, ముందు కూర్చున్న ప్రయాణికులు తప్పనిసరిగా సీటుబెల్టు ధరించాలి. ఈ నిబంధన బస్సులకు కూడా వర్తిస్తుందని మంత్రి ఆంటోని తెలిపారు. ఇటీవల రెండు ప్రైవేటు బస్సుల మధ్య చిక్కుకొని బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ జంట చనిపోయింది. దీనిపై విలేకరులు ప్రశ్నించగా.. ఆ బస్సులు తిరిగే సమయాల్లో మార్పులు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన బదులిచ్చారు. ఈ విషయాన్ని సంబంధిత ఆర్టీవోలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.
కేరళ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు !
October 19, 2023
0
Tags