ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న వేళ.. ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించిన ఈసీ చివరకు ఎన్నికల పరిశీలకులతో కీలక భేటీకి సిద్ధమైంది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన తుది వ్యూహాన్ని ఖరారు చేసేందుకు శుక్రవారం ఢిల్లీలో సమావేశం కానుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థంగా అమలు చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధనం, కండ బలం ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేయనుంది. ఇందుకోసం పోలీసులు, వ్యయాల, సాధారణ విభాగాలకు సంబంధించిన పరిశీలకులతో శుక్రవారం మొత్తం సమీక్ష జరిపి.. తుది ప్రణాళిక ఖరారు చేయనుంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తోపాటు తెలంగాణలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఇప్పటికే సమీక్షలు జరిపింది. ఎన్నికల సన్నద్ధతపై అధికారులకు అవసరమైన సూచనలు చేసింది. ఈ క్రమంలోనే వివిధ విభాగాల ఎన్నికల పరిశీలకులతో శుక్రవారం కీలక సమావేశం జరపనునంది. మిజోరం అసెంబ్లీకి గడువు ఈ డిసెంబర్ 17తో ముగుస్తుంది. కాగా తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల అసెంబ్లీల కాలపరిమితి వచ్చే ఏడాది జనవరి వరకు ఉంది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో నవంబర్-డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో భారాస, మధ్యప్రదేశ్‌లో భాజపా అధికారంలో ఉండగా.. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో కొనసాగుతోంది. ఇదిలాఉంటే, అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై వరుస సమీక్షలు ముగిసిన నేపథ్యంలో మరికొన్ని రోజుల్లోనే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
రేపు పరిశీలకులతో ఎన్నికల సంఘం కీలక సమావేశం !
October 05, 2023
0
Tags