రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ గద్వాలలో బీసీ నినాదం బలపడినందుకే భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పోటీకి దూరమైందని ఆమె భర్త, గద్వాల మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డి స్పష్టం చేశారు. గద్వాలలోని తన ఇంట్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రెడ్లు తురుమ్‌ఖాన్‌లు కాదని, తాము రెడ్ల రాజకీయం చేయడం లేదన్నారు. 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అండదండలతోనే డీకే కుటుంబం రాజకీయంగా ముందుకు సాగుతోందన్నారు. తమ కుటుంబ రాజకీయంపై కొందరు పని కట్టుకుని విష ప్రచారం చేస్తున్నారన్నారని పేర్కొన్నారు. తమపై అలాంటి ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. గద్వాల ప్రాంతంలో సీడ్ మాఫియా రాజ్యమేలుతోందన్నారు. 800 ఎకరాలకు పైగా పేదల భూములు ఇక్కడి కొందరు సీడ్ ఆర్గనైజర్లు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. చిలుక పలుకులు పలికే కొందరు ప్రజా ప్రతినిధులు ఏమేరకు నడిగడ్డను అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తన అల్లుడి గెలుపు కోసం ఈ దఫా డీకే కుటుంబం పోటీ నుంచి విరమించుకుందని సాగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
బీసీ నినాదం బలపడినందుకే పోటీకి దూరం !
October 28, 2023
0
Tags