పోలీసులు ఓ వ్యక్తిని అక్రమంగా అదుపులోకి తీసుకొని, స్టేషన్లో నిర్బంధించడంపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. లాకప్‌లో అరగంటపాటు అక్రమంగా ఉంచినందుకు బాధితుడికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘటనతో ప్రమేయమున్న ఇద్దరు పోలీసు అధికారుల నుంచే ఈ మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశించడం గమనార్హం. ఈ కేసులో పోలీసుల ప్రవర్తన దారుణంగా ఉందని పేర్కొన్న న్యాయస్థానం సామాన్య పౌరుల పట్ల ఉన్నతాధికారులు వ్యవహరిస్తోన్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. ఓ కూరగాయల విక్రేతకు, మహిళకు మధ్య గతేడాది సెప్టెంబర్‌లో గొడవ జరిగింది. దీనిపై ఫిర్యాదు అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. దాదాపు అరగంట పాటు లాకప్‌లో బంధించిన అనంతరం అతడిని విడిచిపెట్టారు. అయితే, పోలీసులు తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్న బాధితుడు.. తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించినందుకుగానూ పరిహారం కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన జస్టిస్ సుబ్రమణ్యన్ ప్రసాద్ పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'ఎటువంటి ఎఫ్‌ఐఆర్ లేకుండా బాధితుడిని అదుపులోకి తీసుకోవడం ఆందోళన కలిగించే విషయం. అరెస్టు చేయకుండానే ఘటనాస్థలం నుంచి తీసుకువచ్చి, అకారణంగా లాకప్‌లో కూర్చోబెట్టారు. అతడు లాకప్‌లో గడిపిన కాలం తక్కువే అయినప్పటికీ.. పిటిషనర్ స్వేచ్ఛను హరించిన పోలీసులను తీరును సమర్థించలేం. ఈ విషయంలో వారు చట్ట ప్రకారం నడుచుకోలేదు. పోలీసులూ చట్టానికి అతీతులు కాదనే సందేశం వెళ్లాలి. అందుకే పిటిషనర్‌కు రూ.50 వేల పరిహారం అందించాలి. ఈ మొత్తాన్ని సదరు పోలీసు అధికారుల జీతాల నుంచే చెల్లించాలి' అని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.
అకారణంగా లాకప్‌లో కూర్చోబెట్టినందుకు పోలీసులకు రూ.50వేల జరిమానా !
October 06, 2023
0
Tags