తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎస్ క్రిష్ణన్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఉద్యోగాన్ని వీడుతున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఒక కారు డ్రైవర్ బ్యాంకు ఖాతాలో పొరపాటున రూ.9 వేల కోట్లు జమ అయిన కొద్దిరోజుల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 'ఇంకా నా పదవీకాలం మిగిలి ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పదవి నుంచి వైదొలుగుతున్నాను' అని క్రిష్ణన్ వెల్లడించారు. బ్యాంకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ రాజీనామాపై సమావేశం నిర్వహించి ఆమోదం తెలిపారు. అలాగే దీనిపై ఆర్‌బీఐకి సమాచారం ఇచ్చారు. 2022లో క్రిష్ణన్ తన బాధ్యతల్లోకి వచ్చారు. ఓ కారు డ్రైవర్ ఖాతాలో టీఎంబీ బ్యాంకు పొరపాటున రూ.9 వేల కోట్లు జమ చేసిందని వార్తలు వెలువడిన వారం వ్యవధిలోనే ఈ రాజీనామా చోటుచేసుకోవడం గమనార్హం. పళని నెయ్‌క్కారపట్టికి చెందిన రాజ్‌కుమార్ చెన్నై కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ అద్దె కారు తిప్పుతున్నాడు. ఈ నెల 9న అతడి బ్యాంకు ఖాతాలో రూ.9 వేల కోట్లు జమైనట్లు సందేశం వచ్చింది. అది నిజమా, కాదా అని తెలుసుకునేందుకు తన ఖాతా నుంచి స్నేహితుడికి రూ.21 వేలు పంపాడు. నిజమేనని నిర్ధారణకు వచ్చి సంతోషించేలోగా ఖాతాలో ఉన్న మిగిలిన డబ్బును తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు వెనక్కి తీసుకుంది. తూత్తుకుడిలోని బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి రాజ్‌కుమార్‌కు అధికారులు ఫోన్‌చేసి పొరపాటున తన ఖాతాలో రూ.9 వేల కోట్లు జమ చేసినట్లు తెలిపారు. తన స్నేహితుడికి పంపిన నగదును కూడా తిరిగి చెల్లించాలని సూచించారు. చెన్నై టీనగర్‌లోని బ్యాంకు శాఖకు రాజ్‌కుమార్ తరఫున న్యాయవాదులు వెళ్లి మాట్లాడటంతో స్నేహితుడికి అతను పంపిన రూ.21 వేలు తిరిగి ఇవ్వాల్సిన పని లేదని, వాహన రుణం ఇస్తామని బ్యాంకు వారు చెప్పినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి.
తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎస్ క్రిష్ణన్ రాజీనామా !
September 29, 2023
0
Tags