జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు మహిళలు, ఓ మైనర్ ఉన్నట్లు బారాముల్లా జిల్లా పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో పలువురు ఉగ్రవాదులు పోలీసులు, భద్రతా సిబ్బందిపై దాడులకు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆర్మీ కలిసి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురిని గుర్తించి అరెస్టు చేశారు. వారి నుంచి మూడు తుపాకీలు, ఐదు హ్యాండ్ గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. 'మొత్తం ఆరుగురిని అరెస్టు చేశాం. వారిలో యాసిర్ అహ్మద్ షా ఉన్నాడు. ఇతడు యాక్టివ్ టెర్రరిస్ట్. మిగతా అయిదుగురు అతడికి సహాయం చేస్తున్నారు. అందులో ఒకరు మైనర్.' అని బారాముల్లా సీనియర్ ఎస్పీ అమోక్ నాగ్‌పురే తెలిపారు. తాజా అరెస్టుల కారణంగా జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడులు జరగకుండా నిరోధించగలిగామని ఆయన చెప్పారు. సరిహద్దు నుంచి అక్రమ ఆయుధాల దిగుమతికి అడ్డుకట్ట వేశామన్నారు. యాసిర్ అహ్మద్ షా అరెస్టు తరువాతే అతడికి సాయపడుతున్న వ్యక్తుల సమాచారం తెలిసిందని పేర్కొన్నారు. ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో మహిళలతో ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటే మహిళలు, మైనర్లు అనే తేడా చూడమని ఘాటుగా హెచ్చరించారు.
జమ్మూ కాశ్మీర్‌లో ఆరుగురి అరెస్ట్ !
September 26, 2023
0
Tags