పాదాల్లో వాపు కనిపించడాన్ని 'ఎడిమా' అంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా సెల్యులైటిస్, డీప్‌వీన్ థ్రాంబోసిస్ అనే కండిషన్లతో పాటు హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్... ఈ మూడు కీలక అవయవాల పనితీరు తగ్గడం వల్ల ఇలా జరిగిందేమో చూడాలి. హైపోథైరాయిడిజమ్ వల్ల కూడా ఇలా జరగవచ్చు. దాంతోపాటు కొన్ని మందుల వాడకంతో పాటు, అసలు ఏ కారణమూ తెలియకుండా కూడా పాదాల్లో వాపు రావచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్‌లో ముఖం మాత్రమే ఉబ్బుతుందని చాలామంది అనుకుంటారు. కానీ కాళ్లవాపూ కనిపిస్తుంది. ఇలాంటప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ నిర్ధారణకు రీనల్ ఫంక్షన్ టెస్ట్ అనే పరీక్ష చేయించి, దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. కాలేయ వైఫల్యంలోనూ కాళ్ల వాపు కనిపిస్తుంది. దీని నిర్ధారణ కోసం 'లివర్ ఫంక్షన్ టెస్ట్ - ఎల్‌ఎఫ్‌టీ' పరీక్ష చేయించి, సమస్య నిర్ధారణ అయినప్పుడు దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కాళ్లలోని సిరలు చక్కగా పనిచేయకపోవడం వల్ల రక్తంలోని నీరు అక్కడే ఉండిపోయి, పాదాల వాపు రూపంలో బయటపడుతుంది. ఎక్కువసేపు నిల్చుని పనిచేసే వృత్తుల్లో ఉన్నవారిలో, ఊబకాయం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువ. పిక్కల్లో నొప్పి, కాళ్లు బరువుగా అనిపించడం, అటు తర్వాత క్రమంగా కాళ్లపైనా, మడమ లోపలి వైపున నల్లటి మచ్చలు, కొంతకాలానికి కాలి సిరలు ఉబ్బి మెలికలు తిరిగి ఉన్నట్లుగా చర్మంలోంచి బయటికి కనిపించడంతో పాటు, అవి పచ్చగా లేక నల్లగా కనిపిస్తే, అది 'వేరికోస్ వెయిన్స్' లేదా ''వీనస్ ఇన్‌సిఫిషియెన్సీ' అనే కండిషన్ కావచ్చు. తొలిదశలో సాయంత్రం మాత్రమే ఉండే కాళ్లవాపు ఆ తర్వాత రోజంతా ఉంటుంది ∙ఇది కాకుండా సెల్యులైటిస్ అనే కండిషన్‌లోనూ కాళ్ల వాపు కనిపిస్తుంది. అంతేకాదు.. ఇలా వాపు వచ్చిన కారణంగా కాలు కాస్త మెరుపుతో కనిపిస్తుంది ∙దీనితో పాటు కాలి సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్లకనిపించే 'డీప్ వీన్ థ్రాంబోసిస్ - (డీవీటీ)' అనే కండిషన్‌లో కూడా కాలివాపు కనిపిస్తుంది ∙ఈ కండిషన్స్ అన్నింటి నిర్ధారణ కోసం కాలి సిరలకు వీనస్ డాప్లర్ టెస్ట్ అనే పరీక్ష చేయించాలి. ఇక్కడ పేర్కొన్న సమస్యలతో పాటు అనేక ఇతర సమస్యల వల్ల కూడా కాళ్ల/పాదాల వాపు రావచ్చు. కొన్ని ప్రోటీన్ల లోపం, మహిళల్లో కటి భాగంలో వచ్చే క్యాన్సర్లలో కూడా కాళ్ల వాపు రావచ్చు. కొందరు గర్భవతుల్లో కాలి సిరలు సామర్థ్యం తగ్గడం, కొన్నిసార్లు థైరాయిడ్ హార్మోన్ లోపించినప్పుడూ వాపు రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో జనరల్ ఫిజీషియన్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించడం, తదనుగుణంగా చికిత్సలు అవసరం.
గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గినప్పుడు పాదాల వాపు కనిపిస్తుంది. ఒక్కోసారి రక్తపోటు పెరగడమూ జరుగుతుంది. గుండెజబ్బు కారణంగా రెండు కాళ్లలోనూ వాపు కనిపిస్తుంది. ముందుగా కాలి ముందు భాగంలోనూ... ఆ తర్వాత మడమ భాగంలో వాపు వస్తుంది. మొదట్లో నొప్పి ఉండదు. ఆయాసం, నడవలేకపోవడం జరగవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణం మెడికల్ స్పెషలిస్ట్ / గుండె వైద్య నిపుణులను కలవాలి. గుండెజబ్బు వల్లనే పాదాల వాపు వచ్చిందా అన్న విషయం తెలుసుకోవడం కోసం బీఎన్‌పీ అనే రక్తపరీక్ష చేయించి, ఈ విలువ 100 కంటే ఎక్కువగా ఉంటే గుండె సమస్య ఉందేమోనని అనుమానించాలి. అప్పుడు గుండె నిపుణుల ఆధ్వర్యంలో ఈసీజీ, ఎకోకార్డియోగ్రఫీ వంటి పరీక్షలు చేయించుకోవాలి.