పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్

Telugu Lo Computer
0


పాకిస్తాన్ సెనేటర్ అన్వర్-ఉల్-హక్ కాకర్ ఎన్నికలకు ముందు తాత్కాలిక ప్రధానిగా ఎంపికయ్యారు. తాత్కాలిక ప్రధానమంత్రిగా బలూచిస్థాన్ అవామీ పార్టీ సెనేటర్ అన్వర్ ఉల్ హక్ కాకర్ ఎంపికైనట్లు ప్రధానమంత్రి కార్యాలయం శనివారం వెల్లడించింది. పదవీ విరమణ చేసిన ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాజా రియాజ్ ఈరోజు జరిగిన సమావేశంలో తాత్కాలిక ప్రధాని పదవికి కాకర్ పేరుపై ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ప్రధాని నివాసం వెలుపల జరిగిన పరిణామాన్ని రియాజ్ మీడియాకు తెలియజేశారు. ఆగస్ట్ 13న తాత్కాలిక ప్రధానిగా కాకర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా,రెండు రోజుల క్రితం పాకిస్తాన్ పార్లమెంట్ అయిన నేషనల్ అసెంబ్లీ రద్దు అయిన విషయం తెలిసిందే. సాధారణ గడువుకు మూడు రోజుల ముందే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ప్రకటించారు. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దాంతో, పాకిస్తాన్ లో జనరల్ ఎలక్షన్స్ కు రంగం సిద్ధమైంది. ఒక వేళ గడువు ముగిసిన తరువాత, పార్లమెంటు రద్దు అయితే, రద్దు అయిన 60 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, గడువు ముగియడానికి ముందే జాతీయ అసెంబ్లీని రద్దు చేసినందువల్ల, నిబంధనల ప్రకారం.. ఎన్నికల నిర్వహణకు మరో నెల అదనంగా సమయం లభిస్తుంది. అంటే, సభ రద్దు అయిన నాటి నుంచి 90 రోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో నవంబర్ లో పాక్ లో ఎన్నికలు జరుగనున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)