గుజరాత్‌లో ఏర్పాటు చేసిన జీ 20 ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ శుక్రవారం వర్చువల్‌గా ప్రసంగించారు. ఆరోగ్య రంగంలో సాంకేతికత లభ్యతను అందరికి సులభతరం చేసేలా చొరవ చూపాలని జీ 20 సభ్యదేశాలకు పిలుపునిచ్చారు. ప్రజాప్రయోజన ఆవిష్కరణలకు ముందుకు రావాలని కోరారు. దీంతోపాటు తదుపరి 'హెల్త్ ఎమర్జెన్సీ'ని నివారించేందుకు, దాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. 'ఆరోగ్య రంగంలో అంతర్జాతీయ స్థాయి చొరవ.. మనందరి ప్రయత్నాలకు ఒక ఉమ్మడి వేదికగా నిలుస్తుంది. డిజిటల్ విధానాలు, ఆవిష్కరణలు ఇందుకు తోడ్పడతాయి. ప్రజాప్రయోజనాల కోసం ఆవిష్కరణలకు ముందుకు రావాలి. ఒకే పనికి వేర్వేరుగా నిధుల వినియోగాన్ని నివారించేందుకు సహకరించాలి' అని ప్రధాని మోడీ కోరారు. సాంకేతికత లభ్యతను సులభతరం చేయడం ద్వారా 'గ్లోబల్ సౌత్' దేశాల్లోని ఆరోగ్య సేవల్లో అంతరాన్ని పూడ్చేందుకు వీలు కలుగుతుందన్నారు. 'నిక్షయ్ మిత్ర' కార్యక్రమం కింద భారత్‌లో దాదాపు 10 లక్షల మంది క్షయ రోగులను పౌరులు దత్తత తీసుకున్నారని, 2030 ప్రపంచ లక్ష్యానికి చాలా ముందుగానే దేశంలో టీబీ నిర్మూలిస్తామని చెప్పారు.
లక్ష్యానికి ముందే క్షయ వ్యాధి నిర్మూలన !
August 18, 2023
0
Tags