నాలుగు నెలల అనంతరం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మళ్లీ పార్లమెంటులో అడుగిడారు. మోడీ ఇంటిపేరు కేసులో ఆయనకు రెండేళ్ల శిక్ష పడింది. ఆ తర్వాత పార్లమెంటు సభ్యత్వం రద్దయింది. తాజాగా సుప్రీంకోర్టు శిక్షపై స్టే విధించడంతో రాహుల్ సభ్యత్వం కూడా పునరుద్ధరించబడింది. రాహుల్ గాంధీ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభకు చేరుకున్నారు. ఇక్కడ విపక్ష నేతలు ఆయనకు గేట్ నంబర్-1 వద్ద ఘనస్వాగతం పలికారు. రాహుల్ గాంధీ కొంత సేపు సభలోనే కూర్చున్నప్పటికీ సభా కార్యక్రమాలు కాసేపటికే వాయిదా పడ్డాయి. అంతకుముందు రాహుల్ గాంధీకి పార్లమెంటు సభ్యత్వం పునరుద్ధరణ కాగానే పార్లమెంటులోని మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో స్వీట్లు పంచి విపక్ష ఎంపీలు సంబరాలు చేసుకున్నారు. మార్చిలో రాహుల్ లోక్ సభ సభ్యత్వం కోల్పోయారు. జులైలో గుజరాత్ హైకోర్టు నుంచి రాహుల్కు ఎదురుదెబ్బ తగలింది. మళ్లీ నాలుగు నెలల తర్వాత ఇప్పుడు సభ్యత్వం పొందారు. ఈ నాలుగు నెలల్లో రాహుల్ పార్లమెంటుకు వెళ్లకపోయినా.. ప్రభుత్వంపై ఆయన దూకుడు ధోరణి చల్లారలేదు. రాహుల్ సోషల్ మీడియా ద్వారా వివిధ అంశాలను నిరంతరం లక్ష్యంగా చేసుకున్నారు.
పార్లమెంటులో అడుగిడిన రాహుల్ గాంధీ !
August 07, 2023
0
Tags