తూర్పు లడాఖ్‌ లో 68వేల మంది సైనికుల మోహరింపు

Telugu Lo Computer
0


మూడేళ్ల క్రితం భారత్‌-చైనా సరిహద్దులోని గల్వాన్‌ లోయలో చోటు చేసుకున్న ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రెండు దేశాల ఆర్మీ ఉన్నతాధికారులు పలుమార్లు సైనిక చర్చలు జరపడంతో పరిస్థితులు కొంతమేర కుదుటపడ్డాయి. కానీ, ఊహించని పరిణామాలు ఎదురైతే వాటిని ఎదుర్కొనేందుకు ఎవరికి వారు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే భారత్‌ తూర్పు లడాఖ్‌ ప్రాంతానికి ఇప్పటి వరకు 68 వేల మంది సైనికులను తరలించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ప్రత్యర్థి కదలికలను ఎప్పటికప్పుడు గమనించి, చర్యలకు సిద్ధంగా ఉండేందుకు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కి చెందిన ఎస్‌యూ-30ఎంకేఐ, జాగ్వార్‌ యుద్ధవిమానాలను అక్కడికి పంపినట్లు తెలిపాయి. మరోవైపు, జూన్‌ 15, 2020నాటి గల్వాన్‌ ఘటనను దృష్టిలో ఉంచుకున్న రక్షణశాఖ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి అప్పటికప్పుడు ఆయుధాలను, బలగాలను మోహరించడానికి వీలుగాని ప్రాంతాల్లో ముందుగానే యుద్ధ సామగ్రిని నిల్వ ఉంచుకునేలా ఏర్పాట్లు చేసింది. వ్యూహాత్మక ఎయిర్‌లిఫ్టింగ్‌ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంది. ఇటీవల మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఆ ప్రాంతంపై డేగకన్ను ఉంచేందుకు పైలట్‌ లేకుండా నడిచే రిమోట్లీ పైలటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ను కూడా భారత్‌ మోహరించింది. ఇది సరిహద్దు మార్గంలో సంచరిస్తూ.. చైనా సైన్యం కదలికలను గమనించి భారత్‌ అధికారులకు చేరవేస్తుంది. అవసరమైతే దాడి చేసే సామర్థ్యం కూడా దీనికి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)