బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో భూసేకరణ సమస్యలతోనే జాప్యం !

Telugu Lo Computer
0


ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు ప్రాజెక్టు భూసేకరణలో ఎదురవుతున్న సవాళ్లతోనే జాప్యం జరుగుతోందని రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ పేర్కొన్నారు. భూసేకరణ సమస్యలతోనే ప్రాజెక్టులో అవాంతరాలు ఎదురవుతున్నాయని మంత్రి శుక్రవారం రాజ్యసభలో చెప్పారు. ఈ మెగా ప్రాజెక్టు పలు అంశాల్లో పురోగతిలో ఉన్నా భూసేకరణ అంశం ఇప్పటికీ ప్రధాన అవరోధంగా ముందుకొచ్చిందని అన్నారు. 2015లో చేపట్టిన అధ్యయన నివేదిక ఆధారంగా ఈ ప్రాజెక్టు లక్షా8వేల కోట్ల వ్యయంతో 8 ఏండ్ల వ్యవధిలో పూర్తవుతుందని అంచనా వేశారు. భూసేకరణ సహా పలు సమస్యల కారణంగా ప్రాజెక్టు అంతకంతకూ జాప్యమవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం 1389 హెక్టార్ల భూమి అవసరం కాగా ఇప్పటికే 1381 హెక్టార్ల భూమి సేకరించారు. మహారాష్ట్రలో ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకిగా మారింది. భూసేకరణలో సవాళ్లు ఎదురవుతున్నా నిర్మాణపరంగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పలు మైలురాళ్లను అధిగమించిందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సివిల్ కాంట్రాక్టులన్నింటినీ నిర్మాణ సంస్ధలకు అప్పగించామని, ప్రాజెక్టును 28 కాంట్రాక్ట్ ప్యాకేజీలుగా విభజించి 23 ప్యాకేజీలను ఇప్పటికే కాంట్రాక్టర్లకు కేటాయించామని తెలిపారు. 248.64 కిలోమీటర్ల ఫౌండేషన్‌, 206.96 కిలోమీటర్ల మేర పిల్లర్లను పూర్తిచేయడం కీలక మైలురాయి అని మంత్రి పేర్కొన్నారు. దీనికి తోడు 69.8 కిలోమీటర్ల సూపర్‌స్ట్రక్చర్ కూడా పూర్తయిందని చెప్పారు. ఇక ఇప్పటివరకూ ఈ ప్రాజెక్టుపై ఏకంగా రూ. 45,621.17 కోట్ల వ్యయాన్ని వెచ్చించినట్టు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ కొలిక్కిరాగానే ప్రాజెక్ట్ వ్యయం, పూర్తయ్యే సమయంపై స్పష్టత వస్తుందని చెప్పారు. రాబోయే నెలల్లో భూసేకరణ ప్రక్రియ వేగవంతమవుతుందని అన్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)