పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సిలిగురి సమీపంలోని సెవోక్ ఎయిర్ బేస్ వద్ద ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో సీఎం స్వల్ప గాయాలతో బయటపడినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. జల్‌పాయ్‌గురి జిల్లాలో మంగళవారం జరిగిన బహిరంగ సభకు హాజరైన దీదీ, అక్కడ ప్రసంగం అనంతరం హెలికాప్టర్ లో బాగ్ డోగ్రా బయలుదేరినట్లు టీఎంసీ నేతలు తెలిపారు. దీదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బైకుంఠపూర్ అటవీ ప్రాంతం మీదుగా వెళ్తుండగా.. వాతావరణ ప్రతికూలత ఎదురైనట్లు చెప్పారు. వర్షాలకు తోడు లో-విజిబిలిటీ కారణంగా సెవోక్ ఎయిర్ బేస్ లో హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు తెలిపారు.
అనంతరం సీఎం రోడ్డు మార్గం గుండా బాగ్ డోగ్రా విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి కోల్ కతా బయలు దేరి వెళ్లినట్లు చెప్పారు. అయితే ఈ ఘటనలో దీదీ స్వల్పంగా గాయపడినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మమతకు శరీరం వెనుకభాగంలో, మోకాలికి స్వల్పంగా గాయాలైనట్లు వెల్లడించారు. దీంతో సీఎంను అంబులెన్స్ లో కోల్ కతాలోని ఎస్ఎస్ కేఎమ్ ఆసుపత్రి (SSKM hospital)కి తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రస్తుతం మమతా బెనర్జీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు.