కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పునర్ వ్యవస్థీకరణపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దృష్టి పెట్టారు. ఈ సంవత్సరం డిసెంబర్‌లోనే తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతుండటంతో పాటు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో సీడబ్ల్యూసీ నియామకాలను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన పార్టీ మూడు రోజుల ప్లీనరీలో, వర్కింగ్ కమిటీ సభ్యులందరినీ నామినేట్ చేసేందుకు పార్టీ అధ్యక్షుడికే పూర్తి అధికారం ఇవ్వాలని స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా కుల, ప్రాంత, రిజర్వేషన్‌ల ప్రాతినిధ్యం ఆధారంగా సభ్యుల ఎంపికను మొదలుపెట్టినట్లు ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. రాయ్‌పూర్ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయం మేరకు సీడబ్ల్యూసీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలు, 50 ఏళ్లలోపు యువకులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో వీటి ఆధారంగా ఇప్పటికే కొందరి పేర్లను షార్ట్‌లిస్ట్ చేసినట్లు టాక్. రాహుల్‌గాంధీ అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ లిస్ట్‌పై చర్చలు చేసి వచ్చే నెలలో తుది ప్రకటన చేస్తారని తెలుస్తుంది.
సీడబ్ల్యూసీ పై ఖర్గే దృష్టి !
June 14, 2023
0
Tags