పశ్చిమ బెంగాల్‌లోని హౌరాకు చెందిన మహ్మద్ రఫీక్, దీపికా పాలీకి మే 31న వివాహం జరిగింది. నవ దంపతులు జూన్ 2న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో గత శుక్రవారం ఆ రైలు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో రఫీక్, దీపికా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రెస్క్యూ సిబ్బంది వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. కాగా, తీవ్రంగా గాయపడిన రఫీక్‌ను ఐసీయూ వార్డులో, గాయాలైన భార్య దీపికాను అదే ఆసుపత్రిలోని సర్జరీ విభాగంలో అడ్మిట్ చేశారు. కటక్‌లోని శ్రీరామ చంద్ర భంజా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నవ దంపతులు రైలు ప్రమాదం జరిగిన వారం తర్వాత తిరిగి కలుసుకున్నారు. అయితే తనకంటే ఎక్కువగా భర్త గాయపడినట్లు భార్య దీపికా తెలిపింది. ఇద్దరినీ ఒకే ఆసుపత్రికి తరలించి ఒకే విభాగంలో చికిత్స అందించాలని అధికారులను కోరినట్లు చెప్పింది. అయితే గాయాల తీవ్రత దృష్ట్యా తన భర్తను ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారని వెల్లడించింది. మరోవైపు పెళ్లైన రెండు రోజులకే రైలు ప్రమాదం బారిన పడటంపై నవ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రాణాలతో బయటపడటం తమ అదృష్టమని పేర్కొన్నారు.
పెళ్లైన రెండు రోజులకే రైలు ప్రమాదం !
June 09, 2023
0
Tags