కర్ణాటకలో పెరిగిన మద్యం ధరలు

Telugu Lo Computer
0


కర్ణాటకలో రాష్ట్ర ప్రజలకు ఐదు గ్యారంటీ పథకాలు అందించే సమయంలో, మద్యం ధరల పెంపు పెద్ద షాక్‌ ఇచ్చింది. కొత్త ధరలు మద్యం ప్రియులకు నిషా దిగిపోయేలా చేశాయనడంలో సందేహం లేదు. కొత్త పథకాలకు నిధులు సేకరించడంతో పాటు రాష్ట్ర ఖజానా ఆదాయం పెంచడమే లక్ష్యంగా కొత్త కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం ధరలను 20 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో శుక్రవారం నుంచి బీర్లు, మద్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ఎక్సైజ్‌ శాఖ చడీచప్పుడులేకుండా పెంపు ఉత్తర్వులు జారీచేసింది. బీర్‌ రూ.10పెంచగా, రమ్, విస్కీ, బ్రాంది, జిన్‌ ఇతర డ్రింకుల ధర బ్రాండ్ల విలువ బట్టి పెంపును అమలుచేసింది. బీర్లపై 20 శాతం ట్యాక్స్‌ విధించడం వల్ల ఒక్క బీర్ల నుంచే ఏడాదికి రూ.500 కోట్లు అదనంగా రాబడి రానుంది. వీటితో పాటు ఇతర మద్యంపై ట్యాక్స్‌లు, ధరలను కలిపి 15 శాతం పెంచారు. దీంతో రాష్ట్ర ఖజానాకి ఏడాదికి రూ.3 వేల కోట్లు అదనంగా ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం కింగ్‌ ఫిషర్, ట్యూబోర్గ్‌ వంటి 650 ఎంఎల్‌ బీర్‌ రూ.160 ఉండగా, 170 కి పెంచారు. బడ్‌వైసర్‌ రూ.200 నుంచి రూ.220 కి పెంపు క్వార్టర్‌ విస్కీ, బ్రాందీ ధర రూ. 198 నుంచి 220 కి పెంచారు. మద్యం ధరలనే కాదు వైన్‌ షాపులు, బార్ల లైసెన్సు ఫీజులను 25 శాతం పెంచాలని ప్రభుత్వం తీర్మానించింది. 2023- 24లో ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా రూ.35 వేల కోట్ల ఆదాయం గడించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇప్పుడు రూ.39 వేల కోట్లకు లక్ష్యాన్ని పెంచడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం బాదుడుపై మద్యం ప్రియులు సోషల్‌ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)