సచిన్ పైలట్ నిర్వేదం !

Telugu Lo Computer
0


బీజేపీ గత ప్రభుత్వ అవినీతిపై చర్యలకు డిమాండ్ చేస్తూ సొంత పార్టీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై నిరసన గళం వినిపిస్తున్న రాజస్తాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆ పార్టీలోని ప్రస్తుత పరిస్థితిపై పెదవి విరిచారు. నిరుత్సాహపూరిత వాతావరణం ఉందని అన్నారు. తన తండ్రి రాజేష్ పైలట్ వర్ధంతి సందర్భంగా దౌసలో ఆదివారంనాడు జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ ర్యాలీలో ఆయన సొంత పార్టీ ప్రకటన చేయనున్నట్టు ఊహాగానాలు వచ్చినప్పటికీ పైలట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆత్మగౌరవం విషయంలో తన తండ్రి రాజేష్ పైలట్ ఎప్పుడూ రాజీ పడలేదని సచిన్ పైలట్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాను సైతం అవినీతిపై రాజీపడలేనని చెప్పారు. వసుంధరా రాజే హయాంలో చేసిన ప్రతి తప్పుడు పనికి శిక్ష ఉండాలని అన్నారు. ''బీజేపీ ప్రభుత్వంపై నేను పోరాడుతున్నా. నేను భగవంతుడిని నమ్ముతాను. ఇప్పుడే కావచ్చు, ఆలస్యంగా కావచ్చు, దేవుడు న్యాయం చేస్తాడు'' అని పైలట్ అన్నారు. గెహ్లాట్‌తో విభేదాలను నేరుగా ప్రస్తావించకుండా, నిరుత్సాహపూరిత వాతావరణంలో కష్టపడి పనిచేయబుద్ధి కావడం లేదన్నారు. ''ప్రతికూల పరిస్థితుల్లోనూ మనము నిజమే మాట్లాడాలి'' అని పైలట్ నిశ్చాతాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో లోపం కనిపిస్తే ఇతరులను నిందించకుండా దానిని సరిచేసుకోవాలని, అవినీతిపై చర్యలు తీసుకోవాలనే తన డిమాండ్ వెనుక ఎవరినీ అప్రతిష్టపాలు చేసే ఆలోచన లేదని పైలట్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో మన అభిప్రాయాలను చెప్పడం చాలా ముఖ్యమని అన్నారు. కాగా, కాంగ్రెస్‌లోనే పైలట్ కొనసాగుతారా? కొత్త పార్టీ పెడతారా? అనే విషయాన్ని మాత్రం ఆయన తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే పైలట్ కొత్త పార్టీ పెడతారంటూ వస్తున్న ఊహాగానాలను తోసిపుచ్చింది. సమష్టిగానే రాజస్తాన్ అసెంబ్లీకి వెళ్తామని స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)