వదంతులను కొట్టిపారేసిన సాక్షి మాలిక్ !

Telugu Lo Computer
0


నిరసనలు ఉపసంహరించుకున్నారంటూ వస్తున్న వదంతులను ఒలంపిక్ మెడలిస్ట్ రెజ్లర్ సాక్షి మాలిక్  కొట్టివేశారు. తాము నిరసనలను ఉపసంహరించ లేదని వివరించారు. ఢిల్లీలోని నార్తరన్ రైల్వేస్‌ కార్యాలయంలో విధులకు సాక్షి మాలిక్ హాజరుకావడంతో రెజ్లర్లు తమ నిరసన ఉపసంహరించుకున్నారంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలను ఆమె కొట్టివేస్తూ, ఒకటి, రెండు రోజుల్లో పూర్తి చేయాల్సిన పెండింగ్ వర్క్ ఉండటంతో కార్యాలయానికి వచ్చానని చెప్పారు. తాము నిరసన దీక్షలు ఉపసంహరించలేదని, రెజ్లర్ల తదుపరి కార్యాచరణ ఏమిటి? అహింసాయుత పద్ధతిలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వ్యూహరచన చేస్తున్నామని తెలిపారు. రైల్వేస్‌లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (క్రీడలు)గా తనకు చాలా బాధ్యతలు ఉంటాయని, ఓఎస్‌డీగా కొన్ని పెండింగ్ పనులు ఉన్నందున విధులకు హాజరయ్యానని సాక్షి మాలిక్ తెలిపారు. బ్రిజ్ భూషణ్‌పై చేసిన ఫిర్యాదులను కొందరు రెజ్లర్లు ఉపసంహరించుకున్నట్టు వస్తున్న వార్తలపై అడిగినప్పుడు, అవన్నీ అభూతకల్పనలేనని సమాధానమిచ్చారు. ప్రజల్లో తమకున్న గౌరవాన్ని దెబ్బతీసేందుకు, ప్రజల నుంచి వస్తున్న మద్దతును దెబ్బతీసేందుకు ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని అన్నారు. తాము మడం తిప్పని పోరాటం చేస్తున్నామని, వెనుకంజ వేసే ప్రసక్తేలేదని చెప్పారు. న్యాయం జరిగేంతవరకూ తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను రెజ్లర్లు శనివారం రాత్రి కలుసుకున్న విషయంపై మాట్లాడుతూ, మామూలుగానే తమ సంభాషణలు సాగాయని, తుది పరిషార్కం ఏదీ జరగలేదని చెప్పారు. "మా డిమాండ్లు అవే. నిందితుడిని అరెస్టు చేయాలి'' అని సాక్షి మాలిక్ పునరుద్ఘాటించారు. తనతో పాటు వినేష్, బజరంగ్ తమ పేర్లను ఉపసంహరించుకోలేదని, కలిసే నిరసనలు కొనసాగిస్తామని చెప్పారు.


Post a Comment

0Comments

Post a Comment (0)